Thursday, April 25, 2024

రాష్ట్రాల మ‌దిలో విఆర్ఎస్ ప‌థ‌కాలు….

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇందులో 1.91లక్షల కోట్లు రెవెన్యూ ఆదాయంగా చూపింది. ఈ మొత్తంలో 1.02 లక్షల కోట్లు మాత్రమే నేరుగా ప్రభుత్వానికి జమయ్యే నిధులు కాగా మిగిలిన సుమారు 89వేల కోట్లు కేంద్రం నుంచి వివిధ పద్దుల క్రింద రాష్ట్రానికందే నిధులు. అయితే రాష్ట్రంలో 5.10లక్షల మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వీరుకాక 3.60లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరి కోసం నెలనెలా సుమారు 7500 కోట్లు జీతాలు, పెన్షన్‌ల బిల్లుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇలా ఏడాదికి వీరికిచ్చే మొత్తం జీతభత్యాల వ్యయం 90వేల కోట్లవుతోంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో పెన్షన్ల కోసం 12,932కోట్లు చెల్లిస్తే 2022-23ఆర్ధిక సంవత్సరంలో ఈ చెల్లింపుల మొత్తం 17,267కోట్లకు చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే పెన్షన్ల బిల్లు గతంతో పోలిస్తే 34శాతం పెరిగింది. రాష్ట్ర రెవెన్యూ ఆదాయానికి, రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగ విరమణచేసే వారికిచ్చే పెన్షన్ల మొత్తం దాదాపుగా సమానంగా ఉంది. ఇదికాక వివిధ శాఖల్లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతభత్యాలు ఈ మొత్తానికి అదనం.

గతంతో పోలిస్తే ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీలు పడి మరీ పార్టీలు ప్రజలకు పలురకాల హామీలు గుప్పిస్తున్నాయి. సంక్షేమానికి పెద్దపీటేస్తూ ఓట్లు రాబడుతున్నాయి. అధికారంలోకొచ్చాక ఈ హామీలను తూచ తప్పకుండా అమలు చేయాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స#హజంగానే ఇది ప్రభుత్వాలపై తీవ్ర ఆర్ధిక భారంగా మారుతోంది.ప్రభుత్వాలు జీతభత్యాల్ని కూడా చెల్లించలేని దుర్భర ఆర్ధిక దుస్థితినెదుర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా జిఎస్‌టి కౌన్సిల్‌ విప్లవాత్మక నిర్ణయానికి సిద్దమౌతోంది. ఇంతవరకు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల విధింపు, వసూళ్ళ #హక్కు రాష్ట్రాల పరిధిలోనే ఉంది. వీటిని జిఎస్‌టి పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ను పలు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఇతర ఉత్పత్తులపై పన్నుల శాతాన్ని తమ ఇష్టానుసారం పెంచుకుంటున్నాయి. తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వీటిపై పన్నుల ద్వారానే సమకూర్చుకుంటున్నాయి. ఈ కారణంగానే పెట్రోలియం ఉత్పత్తుల్ని జిఎస్‌టి పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇంతకాలం ఈ విషయంలో వెనుకంజేసిన కౌన్సిల్‌ ఇక ఉపేక్షించేట్టు లేదు. ఈ నెల్లో లేదా వచ్చే నెల్లో జరిగే జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై తుది నిర్ణయానికి కౌన్సిల్‌ సమాయత్తమౌతోంది. కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు సభ్యులుగా ఉన్నాయి. మూడింట రెండొంతులకు పైగా రాష్ట్రాల్లో బిజెపి లేదా ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలే అధికారంలో ఉన్నాయి. దీంతో స#హజంగానే కౌన్సిల్‌ తీర్మానానికి సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఒక్క సారిగా పెట్రోలియం ఉత్పత్తులన్నీ జిఎస్‌టి పరిధిలోకెళ్తాయి.

దీంతో కేంద్రానికి స్పష్టమైన రాజకీయ ప్రయోజనాలుంటాయి. క్షేత్రస్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ల ధరలు తగ్గుముఖం పడతాయి. ఇది వినియోగదార్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వీటి ధరల తగ్గుదలతో రవాణా చార్జీలు తగ్గిపోతాయి. ఇది నిత్యావసరాల ధరల తగ్గుదలకు దారితీస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు ఒకే ధరకు లభ్యమౌతాయి. స#హజంగానే ఈ చర్య రానున్న ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపికి అనుకూలత సాధిస్తుంది. అయితే అదే సమయంలో పలు రాష్ట్రాలు తామంచనా వేస్తున్న ఆదాయంలో అధిక భాగాన్ని కోల్పోతాయి. ఇప్పుడు రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై 34నుంచి 72శాతం వరకు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉత్పత్తుల విక్రయ ధరల్లో దాదాపు సగానికి పైగా ప్రభుత్వ పన్నులుగానే పోతోంది. పలు రాష్ట్రాలకు వీటిపై వ్యాట్‌, ఇతర పన్నుల ఆదాయమే ప్రధాన వనరుగా ఉంటోంది. ఈ ఆదాయానికి గండిపడుతుంది. అలాగే ఈ ఉత్పత్తులు నేరుగా కౌన్సిల్‌ పరిధిలోకి చేరతాయి. వీటిపై గరిష్టంగా 28 శాతం మాత్రమే పన్నులు వసూలౌతాయి. వాటిలో సగ భాగాన్ని రాష్ట్రాలకు కేంద్రం జమచేస్తుంది.

ఈ ప్రభావం రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే వివిధ రకాల ఆలోచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా తగ్గే ఆదాయానికనుగుణంగా వ్యయాన్ని సవరించుకునేందుకు పధకాలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వోద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ఇందులో ప్రధానమైంది. ప్రస్తుతం రాష్ట్రానికొస్తున్న ఆదాయంతో సమానంగాఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులుంటున్నాయి. పైగా ఈ బిల్లు ఏటేటా అనూ#హ్యంగా పెరుగుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం కోల్పోనున్న రాష్ట్రాలు భవిష్యత్‌లో ఇంత భారీ వ్యయాన్ని భరించగలిగే పరిస్థితుండదు. దీంతో ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ పథకాలకు రాష్ట్రాలు సిద్దమౌతున్నాయి. గతంలో పలుమార్లు ఇలాంటి పథకాలు అమలయ్యాయి. వాస్తవానికి అనారోగ్యం లేదా తగిన కారణాల్తో ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవుల నుంచి వైదొలిగే అవకాశం ఇప్పుడూ ఉంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని అదనపు ప్రయోజనాల్తో ఈ దిశగా ఉద్యోగుల్ని ప్రేరేపించే సంప్రదాయం కూడా ఉంది. ఇందుకోసం ప్రత్యేక పధకం అమలైతే ఉద్యోగులకు ప్రభుత్వం కొంత అదనపు ఆర్ధిక ప్రయోజనం కల్పిస్తుంది. అలాగే వారి కుటుంబ సభ్యుల్లో అర్హతల్ని బట్టి ఒకరికి ఉద్యోగమిస్తుంది. ఈ విధానంలో జీతభత్యాల బిల్లు బాగా తగ్గుతుంది. కొత్త ఉద్యోగులు రావడంతో వారి వేతనాలు కూడా తక్కువ మొత్తంలోనే ఉంటాయి.పైగా వారికి భవిష్యత్‌లో పెన్షన్లు చెల్లించాల్సిన అవసరముండదు. అంచెలంచెలుగా ఏటేటా వేతనాల బిల్లులను తగ్గించుకోవడంతో పాటు కార్యాలయాల్లో యువ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ప్రభుత్వాలు కూడా పనిసామర్ద్యాన్ని మెరుగుపర్చుకునే అవకాశముంటుందని భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement