Monday, May 6, 2024

30 Days – ప్రజాభ్యుదయంలోసరికొత్త పాలన- నెలరోజులు పూర్తి చేసిన రేవంత్ ప్రభుత్వం

ప‌రిణ‌తి గ‌ల రాజ‌కీయ నేత‌గా రేవంత్‌
పాల‌న‌లో త‌న‌దైన మార్క్‌
వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌కు తావివ్వ‌కుండా
ప్ర‌గ‌తి భవ‌న్‌లో అంద‌రికీ చాన్స్‌
ప్ర‌జాభ‌వ‌న్‌గా మార్పు
డ్ర‌గ్స్ వినియోగం, స‌ప్ల‌య్‌పై సీరియ‌స్‌
దుష్ప్ర‌చారం చేసినా.. ఆరు గ్యారెంటీల‌పై ముందుకు
యువ‌త‌లో భ‌రోసా నింపేలా చ‌ర్య‌లు
హైకోర్టుకు నూత‌న భ‌వ‌నం
పాత బ‌స్తీ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో
మంత్రులంతా స‌మూహంగా ప్ర‌జాపాల‌న‌
స‌రికొత్త పాల‌నను చ‌విచూస్తున్న‌ తెలంగాణ

మా సమస్యలను తెలియ చేసేందుకు తగు వేదికలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.. కొత్త ప్రభుత్వంలో ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ‌గా పనిచేస్తున్నాం అని నెల రోజుల ప్రభుత్వ పనితీరుపై సామాన్య ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి వచ్చిన స్పందన ఇది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు స్వీకరించి నేటికీ నెల రోజుల‌య్యింది. రెండు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో ప్రజా సమస్యలను దగ్గరరగా చూసిన రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల పాలనలోనే అత్యంత పరిణితి చెందిన నాయకుడిగా, అనుభవశాలిగా.. పాలనలో తనదైన మార్క్ చూపించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకుండా పరిణితిగల నేతగా వ్యవహరించడం ఈ నెలరోజుల్లో రేవంత్ లో కనిపించిన గొప్ప లక్షణం. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం, వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ, పాలనను సామాన్యుల కందుబాటులో తేవదానికై ప్రజావాణిని తిరిగి ప్రారంభించడం, అప్పటి ప్రగతి భవన్ నేటి ప్రజా భవన్, బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని సామాన్య ప్రజానీకానికి ప్రవేశం కల్పించడం, పాలనా పగ్గాలను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడం తదితర అనేక అంశాలలో రేవంత్ తనదైన శైలిలో వెళ్తున్నారు.

దుష్ప్ర‌చారం చేసినా.. ఆరు గ్యారెంటీల‌పై ముందుకు..
ప్రధానంగా కొందరు చేసిన దుష్ప్రచారంతో, మనస్సుల్లో అనుమానంగా ఉన్న ఆరు గ్యారెంటీల అమలుపై, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ, సీఎం పదవీ భాద్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు హామీలు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాహాలక్షి పధకం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు పది లక్షల వరకు విలువైన వైద్య చికిత్సలు చేసుకునేలా ప్రారంభించారు. వంద రోజుల్లో తాము ఇచ్చిన అన్ని హామీలు ప్రధానంగా, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గంటాపధంగా చెప్పారు. దీనిలో భాగంగానే, సరైన లబ్దిదారులను గుర్తించడానికి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం దరకాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించారు.

డ్ర‌గ్స్ నిరోధానికి క‌ఠిన చ‌ర్య‌లు..
రాష్ట్ర యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్ట పరిచారు. అడిషనల్ డీజీపీ స్థాయి ఉన్నతస్థాయి పోలీస్ అధికారిని ఈ బ్యూరో కు అధిపతిగా నియమించి ఆధునిక పరికరాలు, పూర్తి స్థాయి అధికారులు, సిబ్బందిని, ఇతర అన్ని మౌలిక సదుపాయాలను అందచేశారు. తెలంగాణా లో డ్రగ్స్ వాడినా, అక్రమంగా అమ్మినా వారికి వణుకు పుట్టేలా ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వ్యవహరిస్తుందని సి.ఎం అనేక మార్లు స్పష్టం చేశారంటే, ఈ విషయంలో ఆయనకున్న పట్టుదలను అర్ధం చేసుకోవచ్చు.

యువ‌త నిరాశ, నిస్పృహ‌ల‌ను తొల‌గించేందుకు..
గత పదేళ్లుగా ఏవిధమైన పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను నిర్వహించక పోవడంతో యువతలో ఏర్పడ్డ తీవ్ర నిరాశ, నిస్పృహకు తొలగించటానికి జాబ్స్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోసహా సీనియర్ అధికారులను స్వయంగా ఢిల్లీ లోని యూపీఎస్సి కి వెళ్లి అక్కడ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షల విధానాన్ని అధ్యయనం చేసారు. రెండు లక్షల ఉద్యోగాల నియామాలను చేపట్టడానికి తమ అధికారులకు తగు శిక్షణ నివ్వడానికి సవీకరించాల్సిందిగా యూ.పి.ఎస్.సి. చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు, రాష్ట్రంలో కాళీగా ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీ.ఎస్.సి ని కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పైగా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీలోనూ, గిరిజన తండాలోనూ తప్పనిసరిగా కనీసం ఒక్క ప్రాథమిక పాఠశాల ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. దీనివల్ల అదేగ్రామాలోని పాటశాల ఈడు పిల్లలు చదువులకు గాను ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రతి వూరిలో ఒక పాటశాల ఉండాలని స్పష్టం చేశారు.

ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌ర్చేలా..
యువతకు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక ద్రుష్టి సాధించారు రేవంత్ రెడ్డి. టాటా టెక్నాలజీస్ లాంటి దిగ్గజ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐ లలో దాదాపు ఒక లక్ష మంది విద్యార్థులకు శిక్షణ అందించి పలు పరిశ్రమలో ఉద్యోగాలు పొందే విధంగా తగు శిక్షణ అందించడానికి ముందడుగేసింది. ఇందుకు గాను దాదాపు రెండు వేలకోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్రంలో 4 .0 స్కిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి నిర్వహణకు కావాల్సిన మెషినరీ, పరికరాలను, సాఫ్ట్ వేర్ ను టాటా సంస్థ అందిస్తుంది.

- Advertisement -

స్కిల్ యూనివ‌ర్సిటీల ఏర్పాటు దిశ‌గా..
యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే మరో నిర్ణయం రాష్ట్రంలో పది స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యంగల ఉద్యోగాలను సాధించేవిధంగా ఈ స్కిల్ యూనివర్సిటీ లుండాలని, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సమర్థవంతంగా నడుస్తున్న ఈ యూనివర్సిటీల పనితీరును అధ్యయనం చేయాలని కూడా సి.ఎం ఆదేశించారు.

పాత‌బ‌స్తీకి మెట్రో..
హైదరాబాద్ నగర అభివృద్ధి ఆగిపోతుందని గోబెల్ ప్రచారం చేసినా వారికి చెంపపెట్టుగా, నగరాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికలను ప్రకటించారు రేవంత్ రెడ్డి. పాతబస్తీ కి మెట్రో రైల్ ప్రాజెక్టు ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తిరిగి, పాతబస్తీ మీదుగా మెట్రో రైల్ నిర్మాణాన్నీ చేపడుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో రైలును పాత బస్తీ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు, నాగోల్ నుండిచాంద్రాయణ గుట్ట మీదుగా ఫలక్నుమా వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు, మియాపూర్ వరకు విస్తరించే ప్రణాళికలను కూడా స్పష్టమైన రీతిలో ప్రకటించారు ముఖ్యమంత్రి. నగరంలో కాలుష్య కారకాలుగా ఉన్న ఫార్మా పరిశ్రమలను నగర శివారులో ఫార్మా సిటీ పేర ఏర్పాటు చేసి మళ్ళి మరో కాలుష్యానికి తెరతీసే విధానాన్ని వ్యతిరేకించారు. ఔటర్ రింగ్ రోడ్ కు వెలుపల నగరానికి దూరంగా పది ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపించారు. దీనికి తోడు, ప్రతీ ఉమ్మడి జిల్లాలలో నిరుపయోగంగా ఉండి, అక్కడి భూ యజమానులకు ఏవిధమైన నష్టం వాటిల్లకుండా కనీసం వంద ఎకరాలు సేకరించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకో నున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

హైకోర్టుకు నూత‌న భ‌వ‌నం..
ఇక, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైకోర్టు నూతన భవన నిర్మాణానికి వంద ఎకరాలను కేటాయించడంతోపాటు ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకై తగు చర్యలను చేపట్టేందుకై హైకోర్టు చీఫ్ జస్టిస్ తో రెండు పర్యాయాలు సమావేశమయ్యారు. ప్రధానంగా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏవిధమైన రాజకీయాలకు గానీ, భేషజాలకు గానీ వెళ్లకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే కోణంలో ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, కార్యదర్శులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై పావు విజ్ఞాపనలు సమర్పించారు.

మంత్రులంతా ఒకే తాటిపై..
గతంలోకన్నా, భిన్నంగా తన ప్రభుత్వంలో మంత్రి వర్గ సభ్యులందరు ఒక్క తాటిపై నడవడం ఈ ప్రభుత్వ ప్రత్యేకతగా భావించవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా ప్రతీ మంత్రికి తన సంబంధిత శాఖలపై పూర్తి పట్టు సాధించేలా స్వేచ్ఛనిచ్చారు. దీనివల్ల ఈ నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement