Friday, April 26, 2024

హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైన వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మియాపూర్, చందానగర్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, బోరబండ, రహమత్‌నగర్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, మెహదీపట్నం, పంజాగుట్ట, బేగంపేట్, రాణిగంజ్, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, తిరుమలగిరి, తార్నాక, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్, అంబర్‌పేట్‌, నారాయణగూడ, నాంపల్లి, ఎల్బీ నగర్‌ వనస్థలిపురం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని అనేక రహదారులు జలమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్ల మీద మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వేసవిలో ఎండవేడిమితో సతమతమవుతోన్న నగరవాసులకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. నగరంలో కురుస్తోన్న ఈ అకాల వర్షాల పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసింది.

మరోవైపు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేక్రమంలో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశ మున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు ఒకటి, రెండు చోట్ల వడగండ్లు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement