Tuesday, June 18, 2024

ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్.. రాష్ట్ర పథకాలు కాపీ కొట్టారు: టీఆర్ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దశ – దిశ లేనిదిగా ఉందని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్ మంగళవారం తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేని బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ధోరణిని వీడాలని హితవు పలికారు.

రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ కాపీ : కేకే
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే దాన్ని ఎదుర్కొనే అంశాల ప్రస్తావన బడ్జెట్‌లో లేదని కె.కేశవరావు మండిపడ్డారు. కరోనా కొత్త వేరియంట్ల భయం కొనసాగుతున్న తరుణంలో ఆరోగ్య రంగానికి జరిపిన తక్కువ కేటాయింపులు సరిపోతాయా అని కేకే ప్రశ్నించారు. నిరుపేద, నిరుద్యోగ సమస్యలను ఎలా ఎదుర్కొంటారో కేంద్రం చెప్పలేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం అన్న మాట ఉంది గానీ కేటాయింపులు కనపడడంలేదని చెప్పారు. ఉద్యోగ కల్పన, గ్రామీణ ఆర్ధిక వృద్ది జరిగిన మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25 శాతం నిధులు తగ్గించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సైతం కేటాయింపులు తగ్గాయని వివరించారు.

బడ్జెట్‌లో పట్టణ పేదలకు ఉపాధి హామీ ప్రస్తావన లేదని, గ్రామీణాభివృద్ధిలో 3 శాతం నిధులు తగ్గాయని కేకే తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణాల్లోనూ ఉపాధి కల్పించే కొత్త పథకం అవసరమని కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేకే ప్రస్తావించారు. పట్టణ పేదల నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంపై ఎలాంటి ప్రస్తావన లేదని వాపోయారు. ఇది వ్యవసాయ, నిరుపేద పక్షపాత బడ్జెట్ అని ప్రధాని అంటున్నారే గానీ వ్యవసాయానికి అతి స్వల్పంగా కేటాయింపులు పెంచారని విమర్శించారు. గత బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 1.48 లక్షల కోట్లు కాగా… ఇప్పుడు చాలా తక్కువగా కేటాయింపులు పెంచారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎలాంటి కొత్త పథకాలు లేవన్నారు. తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు. రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్‌ను ఇప్పటికే తెలంగాణలో ప్రారభించామని, వన్ నేషన్-వన్ రిజిస్ట్రేషన్ తెలంగాణ నుంచి కాపీ చేసిందేనని కేశవరావు ఎద్దేవా చేశారు.

డిజిటల్ అసెట్స్ మీద 30% పన్ను వేయడాన్ని బట్టి చూస్తే క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత లేదన్నారు. మెడికల్ కాలేజీల సంగతి వదిలేయండి, విభజన చట్టంలో పెట్టిన ఐఐఎం ఇవ్వాలి కదా అని అడిగారు. జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయాల్సిన ట్రిబ్యునల్ సంగతి ఏమైందని కేకే ప్రశ్నించారు. కార్పొరేట్ సెక్టార్‌కి కొంత ప్రయోజనం కలిగేలా ఉన్నా ఆ విభాగం సంతృప్తిగా లేదని వివరించారు. మసి పూసి మారేడుకాయ తరహాలో ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ఎంపీ ఆరోపించారు. తెలంగాణ విషయంలో పూర్తి వివక్షను ప్రదర్శిస్తూ శత్రువులా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. విద్యా రంగంలో 18% కేటాయింపులు అనేదొక్కటే ఫరవాలేదని కేకే అభిప్రాయపడ్డారు. మూలధన వ్యయం పెంచినా… తెలంగాణా ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉండడం వల్ల రాష్ట్రానికి పెద్దగా ఉపయోగమేమీ లేదని ఆయన వెల్లడించారు.

జాతీయ సేకరణ విధానం అవసరం : నామా
పేదలు, రైతులు, ఉద్యోగుల గురించి ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనా లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే అమృత కాలమంటున్నారు… ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ అమృత కాలం అనడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టే బడ్జెట్ అని నామా అభిప్రాయపడ్డారు. డిజిటల్ రూపీ, డిజిటల్ ఫార్మింగ్ పేరుతో ఏది మాట్లాడినా డిజిటల్ అంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో రైతుల పంటల వల్ల బతికామని, సర్వీస్ సెక్టార్ కాపాడిందని ఆయన గుర్తు చేశారు. గుజరాత్‌ను గిఫ్ట్ సిటీ అంటున్న కేంద్రం
అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని హితవు పలికారు. లాండ్ రిజిస్ట్రేషన్ జాతీయం చేయాలనుకుంటున్నారని, భూమి రాష్ట్ర అంశమని ఆయన వివరించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కోసం గత పార్లమెంట్ సమావేశాల్లో పోరాడి సమావేశాలను బహిష్కరించామని నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. ధాన్యం సేకరణపై జాతీయ సేకరణ విధానం తీసుకువస్తే బావుండేదని స్పష్టం చేశారు.

- Advertisement -

అసమానతలు పెంచేలా బడ్జెట్ : సురేష్ రెడ్డి
వ్యవసాయ చట్టాలను మరో రూపంలో తీసుకువచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఎంపీ సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైళ్లు, ప్రైవేట్ వ్యుక్తులను ప్రోత్సహించడం ఆందోళన కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పడం లేదని, ఉపాధి హామీ పధకానికి నిధులు తగ్గించారని ఆయన విమర్శించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని వాపోయారు. గత నాలుగేళ్లలో అసమానతలు పెరిగాయని ఆర్ధిక నిపుణులు పేర్కొన్నారని, నాలుగున్నర కోట్ల మంది ప్రజలు దేశంలో అతి పేదరికంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయని సురేష్ రెడ్డి వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ అసమానతలను పెంచేలా ఉందని ఆయన అన్నారు.

వివక్ష ధోరణి వీడాలి : రంజిత్ రెడ్డి
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎంపీ రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు శత్రువుగా మారిందో అర్ధం కావడం లేదన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని, రాష్ట్రాలు బావుంటే కేంద్రం బావుంటుందని ఆయన స్పష్టం చేశారు. తమకు సహకరించాలని కేంద్రానికి లేఖలు రాసినా ఫలితం శూన్యమని రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే పీయూష్ గోయల్ అవకాశం లేదన్నారని ఆయన వివరించారు. తెలంగాణ పట్ల వివక్ష ధోరణిని కేంద్రం వదులుకోవాలని రంజిత్ రెడ్డి హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement