Thursday, September 21, 2023

One and Only – సిఎంగా కెసిఆర్ స‌రికొత్త రికార్డ్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: బక్కపలచన ఆయనతో అయ్యే దేంటి? ఆయనతో ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్‌ను విడదీయడం అంత సులువా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడదీసి కొత్త రాష్ట్రం (తెలంగాణ) ఏర్పాటు- కేసీఆర్‌తో సాధ్యమా అన్న వారి నోర్లు మూయించి రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్‌దే! ఎన్ని ఆరోపణలు, ఛీత్కారాలు, సూటి పోటి మాటలు చివరికి బెదిరింపులు వచ్చినా ఏ మాత్రం పట్టించు కోకుండా వెరవకుండా 13 ఏళ్ల పాటు- అలుపెరగని పోరాటం చేసిన ధీరోధాత్తుడు సహనశీలి, నిగర్వి ఆయన. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అలియాస్‌ కేసీఆర్‌. రాష్ట్ర సాధనలో పక్కా ప్రణాళికలను రూపొందించి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి అన్ని ప్రాంతీయ జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన అపర మేధావి, చాణుక్యుడన్న పేరును పదిలం చేసుకున్న తెలంగాణ బాపూజీ కేసీఆర్‌.

ఒకప్పుడు.. అతను చెప్పే మాటలను ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదు.. ఏకంగా అప్పట్లో తాను కొనసాగిన అధికార పార్టీ తెలుగుదేశం అధినాయకత్వానికి ఎదురు తిరిగి.. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి) పార్టీని ప్రారంభించిన మహా నేత ఆయన. ఉప సభాపతి పదవికి గుడ్‌ బై చెప్పి జలదృశ్యంలో కొద్ది మంది మద్దతుదారులతో తెరాసకు అంకురార్పణ చేసిన ఘనత ఆయన సొంతం. తెలంగాణ వెనకబాటు-తనంపై అటు- శాసన సభలో ఇటు- ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరించి వారిని కార్యోన్ముఖులను చేసిన సత్తా ఆయనది. నీళ్లు, నిధులు, నియామకాలు.. అంటూ మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు.. ప్రజలతో మమేకమై స్వరాష్ట్రం కోసం పోరాడారు.. తెలంగాణ ఆత్మగౌరవం చాటిచెప్పి.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సుసాధ్యం చేసి చూపించి చరిత్రలో నిలిచిపోయారు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ దేశాన్నే తనవైపు చూసేలా పథకాలను అమలు చేస్తున్న మహానేత. జూన్‌ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి.. పదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు భారీ ఏర్పాట్లు- చేస్తోంది. ఏకంగా 21 రోజుల పాటు- దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ మరో రికార్డు సొంతం చేసుకోనుండటం విశేషం. ఏకబిగిన 9 ఏళ్ల పాటు- పాలించిన తెలుగు సీఎంగా కేసీఆర్‌ జూన్‌ 2తో రికార్డు సాధించనున్నారు. ఇప్పటివరకు మొత్తం 24 మంది తెలుగు సీఎంలలో ఎవరికీ దక్కని కీర్తిని.. కేసీఆర్‌ సొంతం చేసుకున్నారు.

- Advertisement -
   

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. 2014 జూన్‌ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌ 13న రెండోసారి ప్రమాణం చేశారు. అయితే.. 2023 జూన్‌ 2తో తొమ్మిదేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ గులాబీ దళపతి సీఎం కేసీఆర్‌కు మరో ఖ్యాతి దక్కడం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. తెలంగాణను ఏకధాటిగా తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పాలించడంతోపాటు- కేసీఆర్‌.. తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ట్రానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం 9ఏళ్ల పాటు- ముఖ్యమంత్రిగా ఇదే మొదటిసారి కావడంతో పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్‌) సీఎంలుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు టీ-డీపీ నేత చంద్రబాబు నాయుడు పేరిట ఉంది. ఆయన మూడు విడతల్లో మొత్తం 13 ఏళ్ల 247 రోజుల పాటు- సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 8ఏండ్ల 256 రోజులు మాత్రమే. 2004లో ఓడిపోయిన చంద్రబాబు పదేళ్ల తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఎన్నికయ్యారు. రెండు వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, తెలుగు వ్యక్తిగా అత్యధిక కాలం.. ఉమ్మడి రాష్ట్రానికి 8 ఏళ్ల 256 రోజులపాటు- చంద్రబాబు సీఎంగా ఉన్న రికార్డును.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిగమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement