Friday, May 3, 2024

వేసవి సందర్భంగా.. ప్రయాణికులకోసం ఐదు స్పెషల్ ట్రైన్లు

ప్ర‌యాణికుల‌కోసం ఐదు స్పెష‌ల్ ట్రైన్లు న‌డ‌పాల‌ని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణ‌యించింది. వేసవి సందర్భంగా విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు నడప‌నున్నారు. విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి, మహబూబ్‌నగర్, భువనేశ్వర్, బెంగుళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య 5 వీక్లీ స్పెషల్ రైళ్లు నడపనునన్నట్లు అధికారులు ప్రకటించారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా మిగతా రూట్లలోనూ సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాజా నిర్ణయంలో భాగంగా.. విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు(08579) మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు 08.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08580) మార్చి 2 నుంచి ఏప్రిల్ 27 వరకు ప్రతి గురువారం రాత్రి 07.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 06.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఇక విశాఖపట్నం- మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ రైలు(08585) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 05.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మహబూబ్‌నగర్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08586) మార్చి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు బుధవారాల్లో 06.20 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(08583) మార్చి 6 నుంచి ఏప్రిల్ 24 వరకు సోమవారాల్లో రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08584) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం-బెంగుళూరు కంటోన్మెంట్ వీక్లీ స్పెషల్ రైలు(08543) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.15 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. బెంగుళూరు కంటోన్మెంట్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08544 ) మార్చి 6 నుంచి మే 1 వరకు సోమవారాల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగుళూరు కంటోన్మెంట్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 11.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది ..కాగా భువనేశ్వర్-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(02809) మార్చి 4 నుంచి ఏప్రిల్ 29 వరకు శనివారాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు 07.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్(02810) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారాల్లో తిరుపతి నుంచి 20.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 16.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement