Monday, April 29, 2024

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌కి నోటిఫికేష‌న్ రిలీజ్ -ఈ పోటీలో అశోక్ గెహ్లాట్, శశిథరూర్

అక్టోబ‌ర్ 17న కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుండ‌గా..అక్టోబ‌ర్ 19న కౌంటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ అభ్యర్థులు నామినేషన్లు దాఖలైన సందర్భంలో మాత్రమే ఎన్నిక అనివార్యం కానుంది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తేదీల షెడ్యూల్:
నోటిఫికేషన్ తేదీ: సెప్టెంబర్ 22
నామినేషన్ దాఖలు తేదీలు: సెప్టెంబర్ 24 ఉదయం 11 నుంచిసెప్టెంబర్ 30 మధ్యాహ్నం 3 గంటల వరకు
నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 1
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8
ఎన్నికల తేదీ (అవసరమైతే): అక్టోబర్ 17 ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య
కౌంటింగ్ మరియు ఫలితాన్ని ప్రకటించే తేదీ (అవసరమైతే): అక్టోబర్ 19

కాగా రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టాలంటూ పలు రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూనే ఉన్నాయి. అయితే అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం లేదని ఆ పార్టీ తొలిసారిగా బుధవారం సంకేతాలిచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేస్‌లో రాజస్తాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అశోక్ గెహ్లాట్.. పార్టీ నాయకత్వం కోరితే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పారు. అలాగే రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే శశిథరూర్‌.. సోనియాతో సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీతో సమావేశమైన శశిథరూర్.. నామినేషన్‌ దాఖలు, ప్రచారంతోపాటు ఎన్నికల నియమావళి, విధివిధానాలపై చర్చించారు. ఎన్నికల్లో ఓటు వేయనున్న దాదాపు 9,000 మంది పీసీసీ ప్రతినిధుల ఓటర్ల జాబితాను కూడా ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పోటీలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాను కూడా అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం ఉందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంకేతాలు పంపారు. మ‌రి ఎవ‌రు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌డ‌తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement