Tuesday, April 30, 2024

Nirmal: దుర్గామాత బోనాల వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ టౌన్, జూన్ 25 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ వార్డులో దుర్గామాత ఆలయంలో ఆదివారం బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటి వారు, మహిళలు మంత్రికి మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మొన్ననే హైదరాబాదులో గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయని, ఆ బోనాల తర్వాత రాష్ట్రమంతా బోనాల పండుగ ప్రారంభమైనట్లు తెలిపారు. ఆషాడ మాసంలో ప్రతి ఒక్కరూ అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారని, చల్లంగా ఉంచమని అమ్మవారిని వేడుకుంటారని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆలయానికి 15 లక్షలు మంజూరు చేసి నిర్మించామని తెలిపారు. అడెల్లి పోచమ్మ ఆలయాన్ని 15కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. నందిగుండం గండి రామన్న చింతకుంట వాడ బాలాజీ వాడ బుధవార్ పేట్ ఇలా పట్టణంలో అన్ని ఆలయాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాకముందు ఏ ప్రభుత్వాలు ఆలయాలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు తన దేవాదాశాఖ మంత్రి ఉండడం వల్లనే నిర్మల్లో ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement