Wednesday, April 24, 2024

రాహుల్ కోసం పని చేస్తా.. కానీ : కాంగ్రెస్ కు పీకే కండిషన్!

రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయాల పరంగా ఒక ట్రెండ్ ను సృష్టిస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల ముందు రాజకీయ ప్రత్యర్థులు పరాజయాలను మూటగట్టుకుంటారనే అతియోశక్తి కాదు. పీకే ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన సత్తా చాటి తమను తీసుకున్న రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తుంది. ఇటీవల ఆయన వ్యూహకర్తగా వ్యవహరించిన బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలే ఉదాహరణ. ఆయా రాష్ట్రాల్లో టీఎంసీ, డీఎంకే పార్టీలు సాధించిన విజయాలు ప్రశాంత్ కిషోర్ సత్తాను మరోసారి నిరూపించాయి. తన స్టామినాను బీజేపీకి మరోసారి తెలిసేలా చేశాయి. ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పార్టీలకు పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. ఇక, కాంగ్రెస్ పార్టీకి కోసం పని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే ఆయన కోసం పనిచేయడానికి సిద్ధం అంటూ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో అత్యధిక రాష్ట్రాలను బీజేపీనే పాలిస్తున్నాయి. అయితే, 2019లో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. అయితే, అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ మాత్రం పుంజుకోవడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అంతేకాదు, పలు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోయింది. నోట్ల రద్దు, పెట్రో ధరల పెంపు, జీఎస్టీ, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం తదితర అంశాలపై మోదీ సర్కార్ ను ఇరుకున పడుతున్నా… దానిని ఓట్లు రూపంలో మలుచుకోవడంలో మాత్రం కాంగ్రెస్ ప్రతిసారి ఘోరంగా విఫలం అవుతోంది.

కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఆపార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. అయితే, ఆపార్టీ నాయకత్వలేమితో సతమతమవుతోంది. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి నేడు అధ్యక్షుడే లేదు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా నేతృత్వంలోనే పార్టీ ఇంకా కొనసాగుతోంది. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గతంలోనే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్టీలోని నాయకులు ఆయనను మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. తర్వలో ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్​ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పంజాబ్ మినహా మిగత రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. వీటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరీ కీలకం. అంతేకాదు దేశంలో జమలి ఎన్నికలపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి చాటడం తప్పని సరి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పీకేకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినా.. దానిని ఆయన తిరస్కరించారు. అయితే, ఇప్పుడు బీజేపీని గద్ద దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రశాంత్ కిషోర్.. ఇక కాంగ్రెస్ పార్టీకి పని చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

2014 లో ఎన్డీయే అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ప్రధాని నరేంద్ర మోడీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా తన కెరీర్‌లో అరంగేట్రం చేసిన కిషోర్.. అనంతరం బీజేపీకి దూరం అయ్యారు. అప్పటి బీజేపీ అధ్యక్షడు అమిత్ షాతో విభేదాల తరువాత పార్టీతో విడిపోయారు. అనంతరం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీల మహాకూటమి కోసం పని చేశారు. అయితే, ఢిల్లీలో అఖండ విజయం సాధించగా.. బీహార్ లో మాత్రం పీకే అంచనా తప్పింది. అయితే, బీహార్ సీఎం నితీష్‌ ప్రసంగాలతో సానుభూతి ఏర్పడంతో మహాకూటమి అధికారానికి దూరం అయ్యింది. ఇక ఏపీలో వైసీపీ కోసం పని చేశారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి అఖండ విజయం అందించటంలో కీలకంగా పని చేశారు.

బీజేపీతో ఢీ అంటే ఢీ అనే స్థితి ఉండగా.. పీకే బెంగాల్ సీఎం మమత బెనర్జీ కోసం పని చేశారు. పార్టీని గతంలో కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా చేశారు. పశ్చిమ బెంగాల్ లో మమత విజయం పట్ల ధీమాగా ఉన్న ప్రశాంత్ ఏకంగా హోంమంత్రి అమిత్ షాకే తనదైన సవాలు విసిరాడు. బెంగాల్ లో బీజేపీ డబల్ డిజిట్ కూడా దాటదని, ఒకవేళ దాటితే రాజకీయాల వ్యూహాకర్త బాధ్యతల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరి దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాడు. ప్రశాంత్ కిషోర్ టీమ్ వ్యూహాలు బెంగాల్ లో మమత బెనర్జీను ఘన విజయం సాధించే దిశగా తీసుకెళ్లాయి. పీకే ఏ పార్టీ కోసం పని చేస్తే ఆ పార్టీ విజయాలను అందుకుంటుంది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఇక ఈ నేపధ్యంలోనే పీకే రాజకీయ వ్యూహాల కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. దీంతో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే లక్ష్యంతో పీకే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాల ఆక్సిజన్ అందించి 2024లో అధికారంలోకి వచ్చేలా చేస్తాడా? అన్నది చూడాలి.

- Advertisement -

ఇది కూడా చదవండి: బీజేపీ మిషన్ 2022: 6 రాష్ట్రాల ఎన్నికలపై గురి

Advertisement

తాజా వార్తలు

Advertisement