Wednesday, May 8, 2024

Weather | తమిళనాడుకు అలర్ట్​.. ఒకవైపు వర్షాలు, మరోవైపు హీట్​వేవ్​!

తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే.. మరికొన్ని ప్రాంతాల్లో హీట్​వేవ్​ (వేడి, ఉక్కపోత) కూడా ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) ఇవ్వాల (సోమవారం) తెలిపింది. రెండు రోజుల పాటు తమిళనాడులోని కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉంది. దీంతో మే 24 వరకు తమిళనాడులో వేడిగాలులు, అధిక తేమ కారణంగా వాతావరణం దారుణంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, తేని, దిండిగల్, తెన్కాసి, ఈరోడ్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు, నమక్కల్, కరూర్ జిల్లాలతో సహా 13 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా వేసింది. మే 23-26 నుండి 4 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ మీదుగా కొన్ని చోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఈదురు గాలులు ఉంటాయి.

ఇక.. చెన్నై, సిటీ శివారు ప్రాంతాల్లో వచ్చే 24 గంటలపాటు పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 37-38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28-29 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది.

- Advertisement -

గత 24 గంటల్లో ఉరుములతో కూడిన తుపాను ప్రభావంతో.. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా ఉన్నాయి. మదురై (నగరం & విమానాశ్రయం) గరిష్ట ఉష్ణోగ్రత 39.6 ° C, తర్వాత ఈరోడ్ 39.4, తిరుచిరాపల్లి (39.3 ° C), చెన్నైలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 2 డిగ్రీలు తక్కువగా (నుంగంబాక్కం 35.6 ° C, మీనంబాక్కం 37.4 ° C) నమోదయ్యాయి. కాగా, కాంచీపురం, శ్రీపెరంబుదూర్, తిరువలంగడు, వాలాజాబాద్, ఉతిరమేరూర్, వందవాసి, మదురాంతకం, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement