Wednesday, October 9, 2024

TS | రీజ‌న‌ల్ రింగ్‌రోడ్డు దాకా హెచ్ ఎండీఏ ప‌రిధి విస్త‌రించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

అవుటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. గురువారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.

మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని సీఎం సూచించారు. సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలన్నారు. మరోవైపు ల్యాండ్ ఫూలింగ్‌ను వేగవంతం చేయాలని తెలిపారు.

అవసరమైతే ల్యాండ్ ఫూలింగ్, అక్కడి స్థలాల అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో 2031 పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయి. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు.

- Advertisement -

తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని చెప్పారు. అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్ ఫూలింగ్, ల్యాండ్ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సమావేశంలో చర్చ జరిగింది. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement