Monday, April 29, 2024

Government Policies – పెరిగిన సంప‌ద ప‌క్క‌దారి… బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న ప్ర‌భుత్వాలు…

(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – దేశానికి స్వాతంత్య్రమొచ్చిన తొలినాళ్ళలో అభివృద్ది బాధ్యతంతా ప్రభుత్వం పైనే ఉండేది. రాన్రాను టాటాలు, బిర్లాలు వంటి పెట్టుబడిదార్లు జాతీయాభివృద్ది లో తమ వంతు పాత్ర పోషించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్ని భారీగా విస్తరించారు. ఓ వైపు ప్రభుత్వం మరో వైపు ప్రైవేటు రంగాలు సమాంతరంగా దేశాభివృద్దిలో భాగస్తులయ్యాయి. రాన్రాను దేశంలో సంపద పెరిగింది. అదే సమయంలో ప్రైవేటు రంగం విస్తరించింది. పెట్టుబడులకు ప్రైవేటు, కార్పొరేట్‌, బహుళ జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో ఇందిర తర్వాత ప్రభుత్వాలన్నీ అభివృద్ది బాధ్యతను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ఆలోచనకు తెరదీశాయి. అప్పటికే ప్రభుత్వ నిధుల్తో నిర్మించిన ప్రాజెక్టులు లాభసాటిగా ఉన్న సమయంలో కూడా అదనపు పెట్టుబడులు పెట్టి మరింతగా విస్తరిస్తారంటూ వాటిని నామమాత్రపు ధరలపై ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. కేంద్రం నుంచి ఈ విధానం రాష్ట్రాలకు పాకింది. అంతకుముందు ప్రభుత్వాలు తమ సొంత నిధుల్తో ఏర్పాటు చేసిన పరిశ్రమలతో పాటు సహకార రంగంలో ఏర్పాటైన చక్కెర, జౌళి, ఎరువుల మిల్లులు కూడా నష్టాల సాకుతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు అమ్మేశాయి. వీటిని పొందిన ప్రైవేటు సంస్థలు అదనంగా పెట్టుబడులు పెట్టకపోగా వీటికున్న విశాల భూములు, ఇతర స్థిరాస్తులపై పెద్దమొత్తంలో ఆదాయం పొందుతున్నాయి. యుపిఎ హయాంలో దేశంలో పలు పరిశ్రమలు ప్రైవేటుపరం కాగా ఎన్‌డిఎ అధికారంలోకొచ్చాక గత ప్రభుత్వ రికార్డులన్నీ అధిగమించేందుకు ఉవ్విళ్ళూరుతోంది.

నెహ్రూ, ఇందిర హయాంలో దేశంలో సంపద సృష్టికి పెద్దెత్తున ప్రయత్నాలు చేశారు. ఇందుకనుగుణమైన పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టుల్ని నిర్మించారు. వ్యవసాయ, పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. ప్రభుత్వపరంగా రుణాలిచ్చారు. తద్వారా ఉత్పత్తి పెంచారు. ఉపాధి అవకాశాల్ని వృద్ది చేశారు. దేశం మొత్తమ్మీద సంపద సమాంతరంగా విస్తరించేలా కృషి చేశారు. కానీ ఆ తర్వాత జాతీయకరణ, ప్రాపంచీకరణ, ప్రైవేటీకరణల పేరిట మొదలైన కార్యక్రమాల్లో ప్రభుత్వాస్తులు, పరిశ్రమలు, భారీ మౌలిక సదుపాయాలైన రేవులు, విమానాశ్రయాలు, అంచెలంచెలుగా ప్రైవేటు కబంధ హస్తాల్లోకి చేరిపోతున్నాయి. వీటి నిర్వహణా భారం నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. గతంతో పోలిస్తే దేశంలో అన్నిరంగాలు విస్తరించాయి. సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అయితే ఈ సంపదను ప్రభుత్వం వ్యయం చేసే విధానాల్లో తీవ్ర లోపాలు మొదలయ్యాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకం :
గతంలో తామధికారంలోకొస్తే చేపట్టబోయే సంక్షేమ అభివృద్ది పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. పార్టీలు, అభ్యర్ధుల గుణగణాలు, గత చరిత్రలు, వారిచ్చిన మేనిఫెస్టోలకనుగుణంగా ప్రజలు వారికి ఓట్లేసి గెలిపించేవారు. కానీ గత రెండు దశాబ్ధాలుగా ఎన్నికల ప్రక్రియలో మార్పులొచ్చాయి. ఓటర్లను వ్యక్తిగతంగా ఆకట్టుకోవడం మొదలైంది. అంతకుముందున్న సామాజిక దృక్పధం పూర్తిగా కరిగిపోయింది. ఓటర్లకు ఆర్ధిక ప్రలోభాలు మొదలయ్యాయి. రాన్రాను ఎన్నికల అనంతరం కూడా ఐదేళ్ళ పాటు ఉచితంగా, నేరుగా ఓటర్లకు ఆర్ధిక ప్రయోజనం కల్పిస్తామన్న భరోసా పార్టీలు ఇవ్వడం ప్రారంభించాయి. ప్రజలు కూడా ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇప్పుడు అన్నిపార్టీలదీ ఇదే దారిగా మారింది. అందుకనుగుణంగా ప్రభుత్వాలేర్పాటయ్యాక ప్రాధాన్యతలు మారిపోయాయి. ఒకప్పట్లా శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టులు, పరిశ్రమల్లో పెట్టుబడులకు ప్రభుత్వాలు ముందుకురావడంలేదు. పెరిగిన సంపదకనుగుణంగా సమకూరుతున్న ఆదాయాలు వివిధ పథకాల రూపంలో నేరుగా ప్రజల ఖాతాలకు మళ్ళిస్తున్నాయి. ఇప్పుడు పాలనంటే పన్నులు వసూలు చేసి ప్రజల ఖాతాలకు జమ చేయడంగా మారింది. కేంద్రంతోపాటు అన్నిరాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. మిగిలిన కొద్దిపాటి జాతీయ సంపదలైన పరిశ్రమల్ని ఒక్కొక్కటిగా ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేస్తున్నాయి.

ఇందుకోసం అవి ప్రజల్ని నమ్మించే హామీ ఒకటే. ప్రైవేటు, కార్పొరేట్‌, బహుళ జాతి సంస్థలు వీటిలో వేల, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి వీటిని మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తూ విస్తరిస్తాయని. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. జాతీయ సంపదను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు మాత్రమే ప్రస్తుం ప్రభుత్వాల అధీనంలో ఉన్నాయి. ఒకప్పుడు రేవులు, విమానాశ్రయాలు పూర్తిగా ప్రభుత్వాలు నిర్వహించేవి. కాగాఇప్పుడు వీటిలో ప్రభుత్వ వాటా నామమాత్రంగా మారింది. అలాగే రైల్వేలోనూ ప్రైవేటు భాగస్వామ్యం మొదలైంది. ఇప్పటికే కొన్ని రైళ్ళ నిర్వహణాబాధ్యతను ప్రైవేటు సంస్థలకు ప్రయోగాత్మకంగా అప్పగించారు. భవిష్యత్‌లో ఇది దేశ సమగ్రతకు, సుస్థిరతకు ఆమోదయోగ్యం కాదంటూ మేథావులుసూచిస్తున్నారు. రానున్న ఎన్నికల్ని దృష్టిలోపెట్టుకునైనా ఇలాంటి ఉచిత పథకాలు, నేరుగా ప్రజల ఖాతాల్లోకి సొమ్ములు జమ చేసే పథకాలకంటే దేశానికి కొన్ని తరాల పాటు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు వంటి ప్రాజెక్టులపై దేశ సంపదను పెట్టుబడిగాపెట్టేలా తమ విధానాల్ని సవరించుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement