Friday, May 3, 2024

అక్కడ వరికి ఫుల్ డిమాండ్.. దిగుమతి బాగా పెంచిన దేశం ఏదంటే..

ప్రభ‌న్యూస్: ఆఫ్రికా దేశాల్లో ఆహార దినుసుల ఉత్పత్తి పెరుగుతోంది. అదే సమయంలో డిమాండ్‌ మరింత జోరందుకుంటోంది. దీంతో దాదాపు ఆఫ్రికా దేశాలన్నీ ఆహార దినుసుల కోసం దిగుమతులపై ఆధారపడాల్సొస్తోంది. ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక ప్రకారం గత మూడేళ్ళలో ఆఫ్రికా దేశాలు తమ ఆహార అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకున్నాయి. ఇందుకోసం ఎటా 35 బిలియన్‌ డాలర్లను ఖర్చుపెడుతున్నాయి. 2025నాటికి ఆఫ్రికాదేశాల ఆహార పదార్థాల వార్షిక దిగుమతులు 110 బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్నాయి. ఉపసహారా ఆఫ్రికా ప్రాంతంలో 2000వ సంవత్సరం నుంచి వ్యవసాయోత్పత్తిలో వృద్ధి నమోదైంది. అయినప్పటికీ వినియోగం చాలా పెరిగింది. దీంతో ఆఫ్రికా దేశాలిప్పుడు ఆహార భద్రతా సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి.

వాస్తవానికి 2000 వ సంవత్సరంలో ఆహార దినుసుల ఉత్పత్తి వ్యయం 7 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉండేది. అదిప్పటికి ఐదు రెట్లు పెరిగింది. ఆఫ్రికాలో జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. అలాగే పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. అక్కడి జనాభా జీవనశైలి, వినియోగ పోకడలు రోజు రోజుకు మారుతున్నాయి. రానున్న 20ఏళ్ళ లో ఆఫ్రికన్‌ జనాభాలో 50శాతం నగరాలకు తరలెళ్తారు. ఇది వారి ఆహార అవసరాల్ని మరింతగా ప్రభావం చేస్తుందని ది ఆఫ్రికా రిపోర్ట్‌ పత్రిక విశ్లేషించింది. కెన్యాలో మొక్కజొన్న ఆధారిత ఆహారాన్ని అధికంగా తీసుకునేవారు. దీంతో ఉగాలి అనే వంటను తయారు చేసేవారు. అయితే ఇది వండేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు కెన్యాలో పట్టణ, నగరీకరణ వేగంగా జరుగు తోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్నుంచి వలసలు పెరిగాయి. వీరందరి ఆహారపుట లవాట్లు నెమ్మదిగా మారుతున్నాయి. మొక్కజొన్న నుంచి వరి వైపు ఆకర్షితులౌ తున్నారు. ఉగాలి వంటకాన్ని పక్కనపెట్టేశారు.

ఇలాంటి పరిస్థితే ఇథియోపియా, రువాండా, జాంబియా, నైజీరియా, ఘన, మొరాకో, సెనెగల్‌, జింబాబ్వే, వంటి దేశాల్లో కూడా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాలో విస్తృత ఆర్థిక వ్యవస్థలున్నాయి. గతంలో పెదరికంతో ఉన్న దక్షిణాఫ్రికన్లు మొక్కజొన్ననే తినేవారు. కాగా ఇప్పుడు వీరు కూడా వరివైపు మొగ్గు చూపుతున్నారు. సబ్‌ సహారా ఆఫ్రికా జనాభాలోని 60శాతానికి పైగా వరి, గోధుమలు తినేందుకు అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఆఫ్రికన్‌ జనాభాలో సగానికిపైగా బియ్యాన్నే ప్రధాన ఆహారంగా మార్చుకున్నారు. దీంతో ఆఫ్రికాలోని దాదాపు అన్ని దేశాల్లో బియ్యం ఉత్పత్తి కూడా మొదలైంది. అదే సమయంలో ఆఫ్రికా దేశాలకు బియ్యం దిగుమతులు అనూహ్యంగా పెరిగాయి.

ఆఫ్రికాలో అదిపెద్ద దేశాల్లో ఒకటైన ఈజిప్ట్‌లో 2016లో 2.32మిలియన్‌ డాలర్ల విలువైన బియ్యం దిగుమతులు జరిగితే 2020లో ఇది 3.72మిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులకు పెరిగింది. కాబోవెడ్డే, మొజంబిక్‌, సెనెగల్‌, కామరూన్‌ దేశాల బియ్యం దిగుమతులు గత ఐదేళ్ళలో రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్ని భారత ప్రభుత్వం తనకనుకూలంగా మార్చుకోవాలి. వీలైనంత ఎక్కువగా బియ్యం ఎగుమతుల్ని ప్రోత్సహించాలి. తద్వారా ఇక్కడ పెరిగిన ఉత్పత్తినంతా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement