Tuesday, October 15, 2024

Airlines: విమానయానానికి ఫుల్ డిమాండ్‌.. ఒక్కరోజే 53వేల మంది రాకపోకలు

ప్రపంచ దేశాలు కొవిడ్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో విమానయాన రంగం రెక్కలు తొడిగింది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున విదేశీ ప్ర‌యాణికుల రాక‌పోక‌లు పెరిగాయి. ఒక్క‌రోజే 53వేల మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన‌ట్టు జీఎంఆర్ లెక్క‌లు చెబుతోంది. ఇందుకు సంబంధించిన పలు వివరాలను జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సీఈవో ప్రదీప్‌ పణికర్‌ వెల్లడించారు. మార్చి 27న భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించిందని, ఆ ఒక్కరోజే శంషాబాద్‌ విమానాశ్రయం వేదికగా దాదాపు 53వేల మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారన్నారు.

ఇది కొవిడ్‌కు మునుపటి రోజువారీ సగటు ప్రయాణాల సంఖ్యతో పోలిస్తే 109 శాతం ఎక్కువని ప్ర‌దీప్‌ పేర్కొన్నారు. మార్చి 1-15 తేదీల మధ్యకాలంలో జీఎంఆర్‌ విమానాశ్రయం నుంచి దాదాపు 7లక్షల మంది దేశీయ ప్రయాణికులు, మరో లక్ష మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారని తెలిపారు. కొవిడ్‌కు పూర్వం కంటే ఇప్పుడు దేశీయ ప్రయాణాలు పెరిగాయని తెలిపారు. కొవిడ్‌కు ముందు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 55 దేశీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడవగా, ఇప్పుడు వాటి సంఖ్య 70కి చేరుకుందన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు మొదటి దశ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement