Wednesday, May 1, 2024

Breaking: ఫామ్ హౌస్ డీల్స్‌ కేసు.. ముగ్గురు నిందితుల బెయిల్ పిటిష‌న్ వాయిదా

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టులో ఇవ్వాల వాదనలు ముగిశాయి. బెయిల్ పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా… ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అర్హత లేదని కోర్టుకు తెలిపారు. వెంటనే ముగ్గురికీ బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి రూ.100 కోట్లు ఇస్తామ‌ని ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై రామచంద్రభారతి, నందు, సింహయాజి అనే ముగ్గురు వ్యక్తులను సాక్ష్యాధారాల‌తో స‌హా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్‌) విచార‌ణ‌కు రెండ్రోజుల క‌స్ట‌డీకి కోర్టు అనుమ‌తి ఇచ్చింది. కాగా, ఇవ్వాల్టితో వీరి క‌స్ట‌డీ ముగియ‌గా.. నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.

ఇక‌.. ఈ ముగ్గురు నిందితుల నుంచి వాయిస్ శాంపిల్స్ కూడా సేకరించినట్టు తెలుస్తోంది. బేరసారాల వీడియోలో ఉన్న‌ వాయిస్ , తాజాగా సేకరించిన వాయిస్ తో అన‌లైజ్ చేయ‌నున్నారు. అటు, కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా విచారించారు. అనంతరం, ముగ్గురిని కలిపి విచారించారు. వేర్వేరుగా ప్రశ్నించిన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement