Friday, June 14, 2024

Exclusive – మ‌న బ‌డికి బూట్లు… బ్యాగులు ఇంకెప్పుడు?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

శిథిలా వస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ”మన ఊరు-మన బడి” కార్యక్రమాన్ని చేపట్టి ప్రశంసలందుకున్న ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బూట్లు పంపిణీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 9వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ”మన ఊరు – మన బడి” పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 1000కి పైగా పాఠశాలల్లో ఈ పథకం కింద పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించడంతోపాటు డిజిటల్‌ తరగతులను నిర్వహిస్తున్న సంగతి విధితమే. కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ”మన ఊరు – మన బడి” పథకంలో తొలి విడతగా రూ.3497.62 కోట్లు ఖర్చు చేసింది. అయితే విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బూట్లతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించాలన్న డిమాండ్‌ ఇటు విద్యార్థుల్లో అటు ఉపాధ్యాయులు, విద్యావేత్తల్లో వస్తోంది. బ్యాగులు, బూట్లు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించారు.

25లక్షల మంది విద్యార్థులకు వీటిని ఇవ్వాలని విద్యాశాఖ గతంలోనే నిర్ణయించి రూ.298.08 కోట్లు అవసరమని అంచనా వేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులకు పైగా గడుస్తోందని, ప్రభుత్వం వెనువెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులకు ఈ రెండు సౌకర్యాలను కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో 90శాతానికిపైగా విద్యార్థులు పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులేనని, వీరు ప్రయివేటు, కార్పోరేట్‌ విద్యా సంస్థల్లో చదివే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని, ప్రభుత్వం కూడా వీరిని అన్ని విధాలా ఆదుకుంటోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో అత్యధిక శాతం బియ్యం సంచుల బస్తాలతో తయారు చేసిన బ్యాగులను, ప్లాస్టిక్‌ సంచులను బ్యాగులుగా వాడుతున్నారని, వర్షాకాలం సమయంలో బ్యాగులు తడవడంతో పుస్తకాలు కూడా పనికిరాకుండా పోతున్నాయని ప్రభుత్వం బ్యాగులను అందిస్తే ఈ సమస్య ఉండదని సమాచారం. దీంతోపాటు పాఠశాలలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉండడంతో వారు బూట్లను కొనుగోలు చేసే పరిస్థితి ఉండడం లేదని, కొంతమంది పిల్లలు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండానే పాఠశాలలకు వస్తున్నారన్న ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. బ్యాగులు లేక విద్యార్థులు, బాలికలు పుస్తకాలను తమ భుజాలపై పెట్టుకుని పాఠశాలలకు వస్తున్నారని, పుస్తకాల బరువు అధికం కావడంతో విద్యార్థులకు భుజాల నొప్పి కూడా వస్తోందని తద్వారా అనారోగ్యం పాలవుతున్నామని చెబుతున్నారు.

”మన ఊరు- మన బడి” కార్యక్రమం అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో స్కూలు బ్యాగులు, బూట్ల పంపిణీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చిందని, అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం ఉచిత పుస్తకాల పంపిణీతోపాటు విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్టు, టై, గుర్తింపు కార్డులు ఇవ్వాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారని సమాచారం. సీఎం కేసీఆర్‌ ఆదేశంతో ప్రతిపాదనలు సిద్ధం కూడా చేశామని, అయితే సాంకేతిక కారణాల వల్ల దీన్ని అమలు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, అర్భన్‌ రెసిడెన్షియల్‌ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలో చదువుతున్న 25లక్షల మంది విద్యార్థులకు ”మన ఊరు – మన బడి” పథకంలో భాగంగా స్కూలు బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్టు వంటివి పంపిణీ చేస్తే బాగుంటుందని, తద్వారా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని సమాచారం. బ్యాగులు, బూట్లు ఇవ్వడం ద్వారా విద్యార్థులు కార్పోరేట్‌, ప్రయివేటు పాఠశాలల కన్నా మిన్నగా చదివి ఉత్తమ ఫలితాలు తీసుకువస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

దేశంలో ఎక్కడా ”మన ఊరు – మన బడి” వంటి కార్యక్రమాలు అమలు కావడం లేదని, తెలంగాణ ప్రభుత్వమే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలను కూల్చి వాటిస్థానంలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ”మన ఊరు – మన బడి” పథకాన్ని తీసుకువచ్చింది. కార్పోరేట్‌ సంస్థలను తలదన్నే విధంగా ప్రభుత్వం భవనాలను నిర్మించడంతోపాటు అందులో 12రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు బోధన కల్పించేందుకు వీలుగా డిజిటల్‌ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థి ఇంట్లో కూర్చోనే చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం సౌకర్యాలను కల్పించింది. రూ.9 వేల కోట్లకు పైగా ఈ పథకానికి వెచ్చిస్తున్న ప్రభుత్వం ఇందులోనే స్కూలు బ్యాగులు, బూట్లను చేర్చి వాటిని త్వరితగతిన విద్యార్థులకు అందజేయాలని తద్వారా ప్రభుత్వం పరిపూర్ణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అవుతుందని విద్యావేత్తలు, విద్యారంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రాష్ట్రావతరణ దశాబ్దిఉత్సవాల్లో భాగంగా పదివేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్‌ తరగతులను ఒకేరోజున ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తొలిసారిగా రూ.60 కోట్లు ఖర్చు చేసి ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 13లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా నోటు పుస్తకాలను అందజేసింది. 26లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం పంపిణీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement