Sunday, April 28, 2024

Exclusive – పీపుల్స్ మార్చ్ యాదిలో.. పేద‌ల కోసం క‌దిలిన‌ పాదం!

భ‌ట్టి పాదయాత్ర‌కు ఏడాది
జనం కష్టాలకు సజీవ సాక్ష్యం
ప్రజారాజ్య స్థాపనకు పునాది
17 జిల్లాలు.. 36 అసెంబ్లీ స్థానాల్లో యాత్ర‌
700 గ్రామాల గుండె చప్పుడు
భట్టి విక్రమార్కకు పేద‌ల‌ నివేదన
కాంగ్రెస్ పార్టీలో చలనం చైతన్యం
రాహుల్ గాంధీ హాత్‌సే హాత్ యాత్ర స్ఫూర్తి..
విక్ర‌మార్క మ‌రో సాహ‌స పాద‌యాత్ర‌
ఊరూరా మ‌మేమ‌క‌మై.. అడుగులో అడుగేసిన‌ జ‌నం
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పున‌రుత్తేజం
అధికారంలోకి వ‌స్తే ఏంచేయాల‌న్న త‌ప‌న‌
పేద‌ల‌కు స‌బ్సిడీలు, స‌రికొత్త ప‌థ‌కాలు
నిరుద్యోగుల‌కు చేయూత‌.. బాధితుల‌కు ఆప‌న్న హ‌స్తం
కౌలు రైతుల‌కు భ‌రోసా.. మ‌హిళ‌ల‌కు ఆలంబ‌న‌
ఎన్నో, మ‌రెన్నో పురుడుపోసుకున్న కొత్త ఆశ‌లు
కాంగ్రెస్ స‌రికొత్త పాల‌న‌కు ఈ అడుగులే పునాది
హ్యాట్సాఫ్ భ‌ట్టి అంటూ కొనియాడుతున్న‌ జ‌నం
..

ప్రజల స్వేదం.. శ్రమ ఫలితాన్ని కప్పం పేరిట రాచరిక వ్యవస్థ జుర్రుకుంటే.. 300 ఏళ్లు తెల్లదొరల పీడనను భరించలేక.. అహింస వజ్రాయుధంతో పోరాడి స్వేచ్ఛ స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం. కానీ, తెల్లదొరలు పోయారు. నల్ల దొరలొచ్చారు.. అయినా పేదోళ్ల బతుకుల్లో మార్పు రాలేదు. ఇక.. తెలంగాణ ప్రజల బతుకులు ఆగం ఆగమయ్యాయి. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పద్నాలుగేళ్ల పోరాటంతో తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించింది. అయినా.. జరిగిందేమిటి? పెత్తందారుల రాజ్యం వచ్చింది. గడీల పాలన సాగింది. ప్రజల కన్నీళ్లే పాలకులను సంపన్నులను చేశాయి. కుటుంబ పాలన తప్పలేదు. మరో వైపు రజాకార్లు పోయారనుకుంటే.. కాషాయ మతోన్మాదుల విజృంభణ ప్రారంభమైంది. పల్లె పల్లె ఇంకా కన్నీరు పెడుతూనే ఉంది. కమ్మరి కొలిమి పొగసూరింది. కుమ్మరి చక్రం ముక్కలైంది, జాలరి పగ్గం చినిగి చింపిరైంది. సాలెల మగ్గం సడుగురిగాయి. గనిలో, వనిలో, కార్ఖానాలో శ్రామికుల శ్రమ చెమట ఇంకిపోయింది. కర్షకుల గుండెలవిశాయి. ఈ కుటుంబ రాజ్యం.. ఆ మ‌త రాజ్యం కాదు.. ప్రజాస్వామ్య రాజ్యం కావాలని జనం మౌనంగా రోధిస్తున్న వేళ.. మరో ఉద్యమం పురుడుపోసుకుంది.

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ చలించిపోయింది. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అంటే.. 2023 మార్చి 16న అప్పటి సీఎల్పీ నేత.. నేటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారు. ఆ యాత్ర 106 రోజులుగా ముందుకు సాగింది. 1364 కిలోమీటర్లు నడిచి.. జనం బాధలను కళ్లార చూసి భట్టి చలించిపోయారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్య స్థాపనకు పునాది వేశారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగిందిలా…

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి ఖమ్మం వరకూ మార్చి 16 నుంచి జులై 2వ తేదీ వరకు.. 17 జిల్లాల్లో 36 నియోజకవర్గాల్లో 700 గ్రామాల్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగింది. 100కు పైగా కార్నర్ మీటింగ్ లు జరిగాయి. మంచిర్యాల, జడ్చర్ల, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు జ‌రిగాయి. మంచిర్యాల బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, జడ్చర్ల సభలో హిమాచల్ ప్రదేశ్ అప్ప‌టి ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్, ఖమ్మం సభలో పార్టీ ముఖ్య నేత‌ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పాద యాత్ర 1000 కిలోమీటర్లకు చేరుకున్న తరుణంలో దేవరకొండ నియోజకవర్గం, కొండమల్లేపల్లి మండలం గుమ్మడిపల్లిలో ఒక పైలాన్, 1360 కిలోమీటర్లకు చేరుకున్న దశలో పాలేరు నియోజకవర్గం పొన్నేకల్లు గ్రామంలో ఒక పైలాన్ ఆవిష్కరించారు. తమిళనాడు సీఎల్పీ నాయకుడు సెల్వ పెరుత్తుంగై, చత్తీస్ గఢ్ ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యులు రంజితా రంజన్, ప్రజాపార్టీ వ్యవస్థాపకులు గద్దర్, బండ్లగణేష్, మాజీ మావోయిస్టులు, సొసైటీ ఫర్ ఎర్త్ జస్టీస్ సభ్యులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ఏఐసీసీ, పీసీసీ నాయకులు ఈ పాదయాత్రకు మద్దతు తెలిపారు.

ఊరూరా జనంతో.. భట్టీతో మమేకం

తెలంగాణాలోని 17 కొత్త జిల్లాల్లో 700 గ్రామాల్లో భట్టి విక్రమార్క పర్యటించారు. ఊరూరా ఆకలితో అలమటిస్తున్న ఆదివాసీలు, గోండులు, గిరిజనులు, చెంచులను కలిశారు. మట్టి కోసం అల్లాడుతున్న కుమ్మర్ల గుండె ఘోష విన్నారు. ఇండ్ల కరవుతో నిలువ నీడ లేని లేని నిరుపేదల ఆవేదన విన్నారు. మా భూములు మాకు ఇవ్వండని దళితుల ఆక్రోశానికి చలించిపోయారు. మా బతుకులు.. మా ఉద్యోగాలు మాకివ్వండని నినదిస్తున్న విద్యార్థి, నిరుద్యోగుల వ్యథలు తెలుసుకున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మా బతుకులెప్పుడు మారతాయని దిక్కులు చూస్తున్న బడుగు, బలహీన, మైనార్టీల గడపల్లో కన్నీటి గాథలకు తల్లడిల్లిపోయారు. పింఛన్లు అందని వికలాంగులను బాధ విన్నారు. బెల్టు షాపులతో బతుకులు చిధ్రమవుతున్నాయన్న ఆడబిడ్డలతో కన్నీటి వ్యథలు తెలుసుకున్నారు. పై చదువులు ఎన్ని చదివినా.. ఉద్యోగ ఉపాధి లేక కూటికోసం.. కులవృత్తుల్లో మగ్టిపోతున్న తెలంగాణ తమ్ముళ్లను కలిశారు. చరఖా పట్టే నేతన్నలు, తాటి చెట్లెక్కే గీతన్నలు, కత్తెర పట్టిన నాయీ సోదరులు, చేపలు పట్టే జాలరి తమ్ముళ్లు, పశువుల కాపరులు యాదవ బిడ్డలు, సహస్త్ర కులవృత్తులు, సమస్త ప్రజల వ్యథలను, . అందరి కష్టాలు, కన్నీళ్లు చూసి చలించిపోయారు.

త‌ల్ల‌డిల్లిన విక్రమార్క గుండె

ఇండ్లు లేని నిరుపేదలు ఓ వైపు.. వందల ఎకరాల్లో ఫామ్ హౌసుల్లో కులుకుతున్న గులాబీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరోవైపు , నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఒక వైపు.. దొడ్డిదారిలో కూతురికి ఎమ్మెల్సీ ఉద్యోగమిచ్చిన కేసీఆర్ మరోవైపు, నీళ్ల కోసం చేదబావులకు సాక్షులైన ఆదివాసీలు ఒకవైపు.. మిషన్ భగీరథ నీళ్ల పేరుతో కోట్లు దోచేసిన కేసీఆర్ వారసులు ఇంకో వైపు. ఈ మగ్గిపోయిన బియ్యంతో అన్నం తింటే కడుపు నొస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రజలు ఒక వైపు.. సమస్త సంపదను దోచేస్తున్న కల్వకుంట్లాసురులు మరోవైపు.. గంజి కోసం ఏడుస్తున్న తెలంగాణ బిడ్డలు ఓ వైపు.. బెంజి కార్లలో ఉరకలేస్తున్న గులాబీ బిడ్డలు మరో వైపు, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు లేక అల్లాడుతున్న దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ బిడ్డలు ఓ వైపు.. కార్పొరేట్లకు విద్యా వ్యవస్థను అమ్మేస్తున్నకేసీఆర్ మరోవైపు , ఎటు పోతోంది.. ఈ తెలంగాణ … ఏమై పోతోంది ఈ తెలంగాణ అని అప్పటి సీఎల్సీ నేత భట్టి విక్రమార్క గుండె రగిలిపోయింది.

- Advertisement -

ఇక పోరాటమే లక్ష్యంగా…

నీళ్లకోసం, నిధుల కోసం, నియామ‌కాల కోసం, ఆత్మ గౌర‌వం కోసం, స్వేచ్ఛగా త‌లెత్తుకుని బ‌తికేందుకు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.. తెచ్చుకున్న తెలంగాణ ల‌క్ష్యాల‌ను, అమ‌రుల ఆశ‌యాలు నెర‌వ‌ర‌లేద‌ని శాస‌న‌స‌భ‌లోనూ, బ‌య‌ట ప‌దే ప‌దే చెప్పాం.. నిన‌దించాం.. అయినా అధికార అహంతో క‌ళ్లుమూసుకున్న పాల‌కులు అదేమీ లేద‌ని చెప్పారు. అస‌లు నిజాల‌ను ఈ తెలంగాణ సామాజానికి మీడియా క‌ళ్లతో చూపించాల‌నే పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర పేరుతో మార్చిన 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వర్గం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్ర పేరుతో అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బ‌య‌లు దేరారు. ఈ పాదయాత్రలో ప్రజల మాటలు, బాధను విని.. ఈ సమాజంలోనే ఉన్నామా…? అన్న సందేహం కలిగింది. ఎన్నో ఘటనలు కదిలించాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకర్గం కొప్పోలు గ్రామంలో సువర్ణ అనే మహిళ “ మేం పేదోళ్లం.. వెనుక‌బ‌డ్డోళ్లం.. మీరే మాకు కొండంత అండ.. ధైర్యం.. మీరు అధికారంలోకి రావాలి.. మాకు అన్నీ చేయాలి.. మా బిడ్డ‌లకు ఉద్యోగాలు ఇవ్వాలి.. మాకు ఇండ్లు ఇవ్వాలి.. ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.. మేము బ‌తికేందుకు కావాల్సిన ఆర్థిక వ‌న‌రులు పంచాలి అంటూ చెప్పింది. ఇక్కడ బయటకు రావాలంటేనే భయంగా ఉంది.. కానీ మీరు వచ్చారన్న ధైర్యంతో బయటకు వచ్చి పాదయాత్రలో పాల్గొని మాట్లాడుతున్నా.. అంటూ చెప్పింది. అంతే కాదు.. ఇలా పాదయాత్ర సాగుతుంటే మిషన్ భగీరథలో నిదుల దోపిడీ, ధరణి పోర్టల్ పేరుతో పేదోళ్ల భూమిని దోచుకున్న వైనం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మోసం, కాకతీయ విశ్వవిద్యాలయంలో పేద విద్యార్థులపై సర్కారు వివక్ష, నిరుద్యోగ సమస్య, విద్య ప్రైవేటీకరణ, పేపర్ లీకేజీల పర్వం, తదితర సమస్యలన్నీ వెలుగు చూశాయి.

అధికారంలోకి వస్తే.. చేయాల్సింది ఇదే

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజల సమస్యలను వీక్షించి.. . అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని నిర్ణయాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే రీతిలో భట్టి విక్రమార్క నివేదిక రూపొందించారు. అడవిపై హక్కులు అడవి బిడ్డలకే చెందాలనేది ముఖ్యమైన అంశం. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రెండు గదులు ఇందిరమ్మ ఇంటిని అందించడం.. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడం.. దళితుల నుంచి గుంజుకున్న అసైండ్ భూములను తిరిగి వారికే అప్పగించడం.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం..నేతన్నలు కోరినట్లుగా రాష్ట్ర జీఎస్టీని ఎత్తేయడం, గీత కార్మికులకు ఇన్యూరెన్స్, సోసైటీలకు 5ఎకరాలు కేటాయించడం, విద్య, వైద్యాన్ని గడపగడపకు తీసుకెళ్లడం ప్రధాన్యతాంశాలుగా తీసుకోవాలని భట్టి విక్రమార్క తన నివేదికలో వివరించారు. రైతుబంధుతో పాటు రైతులకు రుణమాఫీ రూ.2 లక్షలు ఏకకాలంలో చేయడం.. అధికారంలోకి వచ్చిన వెంటనే కొలువులను భర్తీ చేయడం.. పండిన పంటకు ముందుగానే మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయడం.. రైతులకు గతంలో ఇచ్చినట్లుగానే వ్యవసాయ సబ్సిడీలను అందివ్వాలరి, ఏ గ్రామానికి వెళ్లినా ఐదారు బెల్టు షాపులు ఉన్నాయి. వీటిని మేం వెంటనే రద్దు చేయాలని . డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోయాలని, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని . లక్షలాది ఎకారాలకు సాగు, తాగు నీరు అందించాలని భట్టి విక్రమార్క కోరారు.

అందరూ అనుకున్నట్టే…

అధికారంలోకి వస్తే తాము ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టే.. ఆరు హమీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు హామీలను అమలు చేసింది. రూ.500లకే వంట గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను నెరవేర్చారు. ఎవరెన్ని ఊసులు దంచినా.. తెలంగాణ ప్రజల ఘోషను నేరుగా వినేందుకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉపయోగపడింది. ప్రజారాజ్య స్థాపనకు బీజం పడింది. ఏడాది కిందట మల్లు భట్టి విక్రమార్క కాలి బాట కాంగ్రెస్ పార్టీ చేతి కర్రగా మారిందన‌డంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement