Friday, May 17, 2024

తెలంగాణ‌,ఎపిల‌తో స‌హా 9 రాష్ట్రాల‌లో ఏక‌కాలంలో ఎన్నిక‌లు?…

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఈమేరకు ఉమ్మడి ఎన్నికల గుర్తులకోసం పార్టీల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. రానున్న ఏడాది కాలంలో ఏపీ, తెలంగాణ సహా మిజోరాం, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, సిక్కిం, అరుణా చల్‌ప్రదేశ్‌, ఒడిస్సా అసెంబ్లి ఎన్నికలు జరగబోతు న్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. ఎలక్షన్‌ సింబల్స్‌ ఆర్డర్‌ 1968లోని పేరా 10 (బీ)ని అనుసరించి ప్రకటన విడుదల చేసింది. 2023-24లో జరగబోయే అసెంబ్లి , లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ఉమ్మడి గుర్తులకోసం దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావిడి పెరగనుంది. ఇప్పటికే ఊపందుకున్న ఏపీ, తెలంగాణ రాజకీయాలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి ఏడాదిని ఎన్నికల ఏడాదిగా తీసుకున్న అధికార పార్టీలు రాబోయే రోజుల్లో ప్రజలకు తాము ఏం చేయబోతున్నా మన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాయి. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నాయి. ఏపీలో ఇప్పటికే 22 రకాల ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు చేయగా దేవాదాయ శాఖలో గ్రేడ్‌-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయబోతోంది. ఇదే క్రమంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కోర్టులో ఉన్న స్టే తొలగించడంతో వీటి భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇక జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 10 జడ్జీల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఉచితాలపై అందిరిదీ అదే బాట
ఇదిలా ఉండగా ఉచిత పథకాల పంపిణీపై కూడా ప్రధాన పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. నవరత్నాల పేరిట ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మరింతగా పెంచే యోచనలో ఉన్నారు. ఆమేరకు పలు విధానాల ద్వారా అర్హత ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందని వారి జాబితాను తీసుకుని వారికి కూడా వాటిని వర్తింపజేయాలని కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఈక్రమంలోనే నిన్నమొన్నటి దాకా ఉచిత పథకాలపై రాద్దాంతం చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఇప్పుడు సంక్షేమ రాగం అందుకుంది. తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే మిన్నగానే సంక్షేమాన్ని అందిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తోంది.

వర్షాలపై ఊపందుకున్న రాజకీయం
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు జరిగిన పంట నష్టంపై ప్రధాన పార్టీలన్నీ తమదైన శైలిలో వ్యవహరిస్తున్నాయి. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే పరిస్థితుల్లో అధికార పార్టీ లేదంటూ తెలుగుదేశం, జసనేన ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా తడిసిన ధాన్యం రాశులవద్దకు వెళ్లి రైతులను సరామర్శిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తడిసిన ధాన్యాన్ని కొనుగోలుచేసేకుందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను విడుదలచేస్తోంది. అంతేకాకుండా పంట నష్టం అంచనాలను వేగంగా తయారుచేసి పరిహారం అందించేందుకు సిద్ధమౌతోంది.

ప్రతి అంశం రాజకీయమే
కాదేదీ కవితకు అనర్హం అన్న మహా కవి శ్రీశ్రీ మాటలను రాజకీయ పక్షాలు నిజం చేస్తున్నాయి. కనిపించిన ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. చిన్నపాటి అవకాశం దొరికినా వాటిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రజల మధ్యకు వెళ్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ కనిపించని రాజకీయ నాయకులు ఇప్పుడు తామున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించే పనిలో పడ్డారు. ఒకవైపు ముందస్తంటూ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇవేమీ కాదంటూ అధికార పార్టీ కొట్టిపారేస్తూనే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొని మరో మారు అధికారం చేపట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ముందే సమాచారం ఉందా
కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించబోతుందన్న సమాచారం ముందుగానే పార్టీలకు తెలిసినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి రెగ్యులర్‌ ప్రొసీజర్‌లో భాగంగానే ఉమ్మడి గుర్తులకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది చర్చానీయంశంగా మారింది. తెలుగుదేశం నుండి భాజాపాలోకి వెళ్లిన పెద్దల సాయంతో తెలుగుదేశానికి, భాజాపాతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్న వైకాపాకు ముందుగానే తెలుసన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈనేపథ్యంలో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లి, లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించడంతో రాజకీయ వేడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement