Friday, June 14, 2024

హెచ్‌ఎండీఏ ప్లాట్ల ఈ-వేలం సక్సెస్‌.. బహదూర్‌పల్లిలో గజం 48 వేలు.. తొర్రూర్‌లో 38 వేలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన ప్లాట్లు, ఫ్లాట్‌ల వేలానికి విశేషస్పందన వచ్చింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్తుల విక్రయం తొలి రోజు సోమవారంనాడు అద్భుత స్పందనతో భారీ రాబడి సమకూరింది. ఓపెన్‌ ఆక్షన్‌లో భారీగా కొనుగోలుదారులు పోటీ పడ్డారు. నాలుగు రోజులపాటు కొనసాగనున్న వేలంలో తొలిరోజు ప్రభుత్వానికి మొత్తం రూ.125 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఎంఎస్‌టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో తొర్రూర్‌ లే అవుట్‌, బహదూర్‌పల్లి లే అవుట్‌లలో ప్లాట్లను, 10 జిల్లాల్లో ఖాళీ స్థలాలు, ప్లాట్లను విక్రయించారు. ఈ విక్రయాలకు అద్భుత స్పందన వచ్చినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌ లే అవుట్‌లో ప్లాట్లకు గజానికి అత్యధికంగా రూ.38వేలు పలుకగా మేడ్చల్‌ జిల్లా బహదూర్‌ పల్లి లే అవుట్‌లో గజానికి అత్యధికంగా రూ.48 వేలు పలికింది. తొలి రోజు ఈ ప్లాట్లతో పాటు నాగోల్‌ బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు కూడా వేలం నిర్వహించారు.

దీంతో పాటు జల్పల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలోని ప్లాట్లకు కూడా వేలం నిర్వహించారు. మొత్తంగా తొలి రోజు ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మకానికి గాను రూ.125 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ వేలం నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఆస్తుల అమ్మకం ద్వారా పన్నేతర ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రాజీవ్‌ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్‌ను ఆన్‌లైన్‌ వేలం పద్ధతిలో విక్రయాలకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్లాట్లు, ఫ్లాట్ల వేలానికి సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ప్రి-బిడ్‌ మీటింగ్‌లలో కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన వ్యక్తమైన విషయం తెలిసిందే.

స్వగృహ ఆధ్వర్యంలోని ఫ్లాట్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. బండ్లగూడ, నాగోల్‌లోని 15 టవర్లను కనీస ధరగా చదరపు అడుగుకు రూ.2200 నుంచి రూ.2700లకు, ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని 8 టవర్లకు చదరపు అడుగుకు రూ.1500 నుంచి రూ.2 వేలకు ధరలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిల్చింది. 23న ప్రకటన జారీ చేయగా, రిజిస్ట్రేషన్లకు చివరితేదీగా మార్చి 22ను పేర్కొంది. ప్రి-బిడ్‌ సమావేశం మార్చి 4న, మార్చి 14న రెండు దశల్లో వేలం నిర్వహించాలని నిర్ణయించారు. బండ్లగూడలో ఈ వేలం మార్చి 24న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, ఖమ్మంలో అదేరోజున మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

223 ప్లాట్ల వేలం ప్రక్రియకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్‌లో 117 ఎకరాల విస్తీర్ణంలో #హదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండిఏ) లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. దీనిలో దాదాపు వెయ్యి ప్లాట్ల వరకు ఉండే తొర్రూర్‌లే అవుట్‌లో ప్రస్తుతం 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా ఆన్‌లైన్‌ ఆక్షన్‌ పద్ధతిలో విక్రయించింది. ఇందుకు సంబంధించి హెచ్‌ఎండీఏ గత నెల 25న ప్రి-బిడ్‌ సమావేశం నిర్వహించింది. ఇందులో మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా 300 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల వరకు ప్లాట్ల సైజుతో హెచ్‌ఎండీఏ లే అవుట్‌ను రూపొందించింది. లే అవుట్‌కు ముందు వంద అడుగుల ప్రధాన రహదారి(మాస్టర్‌ ప్లాన్‌ రోడ్‌), లే అవుట్‌ లోపల 60 అడుగులు, 40 అడుగుల వెడల్పుతో రహదారులను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేస్తోంది. తొర్రూర్‌ లే అవుట్‌లో గజానికి కనీస(బేసిక్‌ రేటు) ధర రూ.20,000లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ లే అవుట్‌లో ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1,180లు, ప్రతి ప్లాట్‌కు లక్ష రూపాయల చొప్పున ఎర్లీ మనీ డిపాజిట్‌(ఈఎండీ) చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి ఒక దఫా, మధ్యా#హ్నం 2 గంటల నుంచి మరొక దఫా చొప్పున నాలుగురోజుల పాటు ఆన్‌లైన్‌ పద్ధతిలో ఎంఎస్‌టీసీద్వారా ప్లాట్ల ఈ వేలం ప్రక్రియ జరుగుతుంది. తాజాగా ఎనిమిది జిల్లాల్లో 1092 ఓపెన్‌ ప్లాట్లను వేలం వేసేందుకు కలెక్టర్లు ప్రి-బిడ్‌ సమావేశాలను ప్రకటించి జిల్లాల వారీగా కూడా సోమవారంనాడు వేలం ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వేలం ప్రక్రియ ఈ నెల 17వరకు కొనసాగించనున్నారు. ఇలా 10 జిల్లాల్లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి 7452ఎకరాలు, హైదరాబాద్‌లో 249 ఎకరాలు, మెదక్‌, సంగారెడ్డిలో 588 ఎకరాలను వేలంలో విక్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement