Saturday, May 11, 2024

Dasara Bonanza – సింగ‌రేణి కార్మికుల‌కు రూ 400 కోట్ల బోన‌స్ .. కెసిఆర్

మంచిర్యాల , ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణాలో కొనసాగతున్నది.. సుస్థిర, సుభిక్ష పాలనంటూ దేశమంతా కొనియాడుతుంటే, మన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు పాలన చేతగాని వాళ్ళంతా నేడు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్టకు ప్రతిబింబంగా ఉన్న ‘సింగరేణి’ సంస్థను కాంగ్రెస్‌ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ధ్వజమెత్తారు. వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని వ్యాఖ్యానించారు. మంచిర్యాల సమీపంలోని నస్పూర్‌ వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి స్థితిగతులను వివరించారు. దసరా పండగ నాడు సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్‌ పంచనున్నామని ప్రకటించారు. అంటే ఆనాడు కంపెనీకి వచ్చే లాభంకంటే నేడు మూడు రెట్లు బోనస్‌గా కార్మికులకు ఇస్తున్నామన్నారు. సింగరేణికి గతంలో రూ.300 లేదా 400 కోట్ల లాభాలు మాత్రమే వచ్చేవి. చాలా తక్కువగా బోనస్‌ ఇచ్చేవారని అన్నారు. గతంలో సింగరేణి కార్మికులు చనిపోతే రూ.లక్ష రూపాయలు పరిహారంగా అందించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కాని భారాస ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచి వారి కుటుంబాలను ఆదుకుంటోందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. డిపెండెంట్‌ ఉద్యోగం తీసుకోకుండా రిటైర్మెంట్‌ తీసుకున్నవారికి రూ.25 లక్షలు ఇచ్చే వసతి కల్పించినట్లు చెప్పారు. కార్మికులకు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ వాళ్లు 49 శాతం సింగరేణి వాటాను కేంద్రానికి అమ్మారు. ఇప్పుడున్న బీజేపీ సర్కార్‌ బొగ్గు గనులను ప్రైవేటికిస్తామని చెబుతూ, సింగరేణిని ముంచి తాళం వేద్దామని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణిలో 6,403 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థను బలోపేతం చేస్తూ, 19వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తు చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటు-పరం చేయాలని కేంద్రం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగా బతుకుతున్న ఇక్కడి ప్రజలను నాశనం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో సరిపడా బొగ్గు ఉన్నా… ఆస్ట్రేల్రియా నుంచి దిగుమతి చెెసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థను ఇంకా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

విద్యుత్‌ రంగంలో సాటిలేని వృద్ధి
తెలంగాణలో ఉన్నట్లు- విద్యుత్‌ మరే రాష్ట్రంలోనూ లేదని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఫ్యాన్లు, ఏసీలు బంద్‌ చేసుకోవాలని కొన్ని రాష్ట్రాల్లో సీఎంలు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. విద్యుత్‌ సరిపడా లేక ప్రభుత్వ ఆఫీసులు ఒక్కపూట నడిపించాల్సిన దుస్థితి వెంటాడుతోందని తెలిపారు. దేశ రాజధాని దిల్లీలోనూ విపరీతమైన కరెంట్‌ కోతలు ఉన్నాయన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినా, 10 రోజుల్లోనే రూ.5 లక్షల చెక్కు ఇస్తున్న ఘనత దేశంలో ఒక్క తెలంగాణకే దక్కిందన్నారు. ధరణి పుణ్యం వల్లే రైతుబంధు, రైతుబీమా అమలవుతోందన్నారు. 99 శాతం రైతుల భూములు ధరణిలో నమోదై ఉన్నాయనీ, ఒక్క రైతు బొటనవేలుతో మాత్రమే భూమి వివరాలు మారతాయనీ సీఎం వెల్లడించారు. మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ను రూపొందించానని చెప్పారు. రైతు భూమిని ఎవరూ ఆక్రమించకుండా చేశామని, గ్రామాల్లో వంద శాతం భూ తగాదాలకు చరమగీతం పాడామనీ పేర్కొన్నారు. వీఆర్‌వో, తహశీల్దార్‌కు లంచం ఇచ్చే పని లేకుండా చేశామని తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కు పనేమీ లేకపోవడంతోనే ధరణి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement