Tuesday, April 16, 2024

Telangana: బీఎల్​ సంతోష్​కు మళ్లీ నోటీసులు.. వాట్సాప్​, మెయిల్​ ద్వారా సెండ్​ చేయాలన్న హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​కు ఈ మెయిల్​, వాట్సాప్​ ద్వారా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఇవ్వాల తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి సిట్‌ను ఆదేశించారు. అయితే, బీజేపీ అగ్రనేత అరెస్టుపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ బీజేపీ నేతలు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. అంతేకాకుండా నవంబర్ 29న ఈ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ధర్మాసనం సిట్‌ను ఆదేసిస్తూ… తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేసింది. ఇప్పటికే నోటీసులు జారీ చేశామని.. బీఎల్​ సంతోష్‌ విచారణకు హాజరుకాకుండా సహకరించడం లేదని సిట్‌ కోర్టుకు నివేదించింది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద బీజేపీ నేతకు ఇప్పటికే నోటీసులు అందాయి. నవంబర్ 21న సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించగా.. ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. అని సిట్​ అధికారులు హైకోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని సంతోష్‌ను ఆదేశించాలని కోరుతూ సిట్‌ కోర్టును ఆశ్రయించింది. కాగా, సంతోష్‌ సిట్‌కు అందుబాటులో ఉండేలా చూడాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్​పై బీజేపీ నేత స్టే విధించాలని కోర్టును కోరారు. బీఎల్​ సంతోష్‌కు జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు నవంబర్ 19న తోసిపుచ్చింది.

అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద సంతోష్‌కు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసినందున అరెస్టు చేయరాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సిట్ నోటీసులో విధించిన షరతులను పాటించాలని న్యాయమూర్తి తెలిపారు. సంతోష్‌కు నోటీసులు అందజేయడంలో సహకరించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారించింది. ఇక ఆలస్యం చేయకుండా బీజేపీ అగ్రనేతకి నోటీసులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

- Advertisement -

మంగళవారం విచారణ సందర్భంగా సంతోష్‌కు ఢిల్లీ పోలీసుల ద్వారా నోటీసులు అందజేసినట్లు సిట్‌ కోర్టుకు తెలియజేసింది. భారీ డబ్బు ఆఫర్‌తో టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాక్కోవడానికి యత్నిస్తుండగా గత నెలలో పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు బీజేపీ ఏజెంట్ల మధ్య జరిగిన సంభాషణలో బీఎల్​ సంతోష్ పేరు కీలకంగా వినిపించింది. సంతోష్‌తో పాటు మరో ముగ్గురికి నవంబర్ 21న హాజరు కావాలని సిట్​ సమన్లు పంపగా.. సోమ, మంగళవారాల్లో కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట హాజరయ్యారు.

భరత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, కేరళకు చెందిన డాక్టర్​ జగ్గు స్వామి ఆచూకీ లేకపోవడంతో దర్యాప్తు బృందం మంగళవారం లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారు దేశం విడిచి వెళ్లకుండా దేశంలోని అన్ని ఎయిర్​పోర్టులకు సర్క్యులర్లు కూడా జారీ చేశారు. ఇదే క్రమంలో బుధవారం మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ ప్రాంతానికి చెందిన న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌, ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ భార్య చిత్రలేఖను విచారణకు పిలిచారు.

కేసు పూర్వాపరాలు ఏంటంటే..

టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్​ రోహిత్​రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్​రెడ్డి, రేగా కాంతారావుకు భారీ డబ్బు ఆఫర్లతో ప్రలోభపెట్టేందుకు యత్నించిన రామచంద్రభారతి (సతీష్ శర్మ), సింహయాజీ, నంద కుమార్‌ ను సైబరాబాద్ పోలీసులు అక్టోబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల్లో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు తనకు రూ.100 కోట్లు, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. నిందితులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement