Monday, April 29, 2024

Countdown – ఫాస్టాగ్‌కూ ఈ-కేవైసీ!…మిగిలింది నాలుగు రోజులే….

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఎల్పీజీ కనెక్షన్ కు కేవైసీ.. రేషన్ కార్డకు కేవైసీ.. బ్యాంక్ అకౌంట్ కు కేవైసీ.. పాన్ కు కూడా కేవైసీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సర్వీసులకు ఇప్పటి వరకు కేవైసీ చేయించుకోవాలని ఆయా సంస్థలు ప్రకటించాయి. వాటిని పూర్తి చేసేందుకు లైన్లలో నిలబడటం, తిప్పలు పడటం ఇప్పటి వరకు జరిగాయి. ఇక ఇప్పుడు ఫాస్టాగ్ కు కూడా వినియోగదారులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుది. ఫాస్టాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండేందుకు వినియోగదారులు వివరాలను అప్డేట్ చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) తెలిపింది. 2024 జనవరి 31 తర్వాత అసంపూర్తిగా ఉన్న కేవైసీ ఉన్న ఫాస్టాగ్ లను డీయాక్టివేట్ చేస్తామని హెచ్చరిచింది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

టోల్ ప్లాజాల వ‌ద్ద అంత‌రాయం లేకుండా..
ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి, టోల్ ప్లాజాల వద్ద అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు హైవే అథారిటీ పేర్కొంది. పలు వాహనాలకు ఒకే ఫాస్టాగ్ వాడకాన్ని తగ్గించడం, ఒకే వాహానానికి పలు ఫాస్టాగ్ లను తొలగించడమే లక్ష్యంగా ఎన్ హెచ్ఏఐ ‘వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్’ కింద ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. అలాగే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కేవైసీని పూర్తి చేయాలని వినియోగదారులను కోరింది. ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలంటే వినియోగదారులు తమ ఫాస్టాగ్ కేవైసీ పూర్తయ్యేలా చూసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. ఫాస్టాగ్ వినియోగదారులు ‘వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్’కు కట్టుబడి ఉండాలని, గతంలో జారీ చేసిన అన్ని ఫాస్టాగ్లను ఆయా బ్యాంకుల ద్వారా తొలగించాలని తెలిపింది. 2024 జనవరి 31 తర్వాత పాత ఫాస్టాగ్ లు డీయాక్టివేట్ అవుతాయని, కాబట్టి కొత్త ఖాతా మాత్రమే యాక్టివ్ గా ఉంటుందని పేర్కొంది.

ఫాస్టాగ్‌ల‌ను ప‌ట్టించుకోని వాహ‌న‌దారులు
కొందరు వాహనదారులు ఫాస్టాగ్ లను ఉద్దేశపూర్వకంగా వాహనం విండ్ స్క్రీన్ పై బిగించడం లేదని, దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన జాప్యం జరుగుతోందని ఎన్ హెచ్ఏఐ తెలిపింది. ఫలితంగా ఇతర వాహనదారులకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొంది. ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించింది. కాగా.. ఫాస్టాగ్ కేవైసీ చేసే విషయంలో మరింత సహాయం కోసం, సందేహాల నివృత్తి కోసం వినియోగదారులు సమీప టోల్ ప్లాజాలు, లేదా ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకుల టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్లను సంప్రదించాలని ఎన్.హెచ్.ఏ.ఐ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement