Friday, May 17, 2024

కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు – ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ జాతీయ రోల్ అవుట్‌కు ఆమోద ముద్ర

కేంద్ర కేబినెట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్ కు కేంద్రం మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదేళ్లకు రూ. 1,600 కోట్ల బడ్జెట్‌తో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) జాతీయ రోల్ అవుట్‌కు ఆమోద ముద్ర వేసింది. నేషనల్ హెల్త్ అథారిటీ .. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలు చేసే ఏజెన్సీగా ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు సమానమైన, సులువైన ప్రాప్యత బలోపేతం అవుతుంది. దీని కింద దేశ ప్రజలు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్‌ను జనరేట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీంతో డిజిటల్ హెల్త్ రికార్డులను లింక్ చేసేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నేషనల్ రోల్-అవుట్ కోసం వచ్చే 5 సంవత్సరాలకు రూ. 1600 కోట్లను ఆమోదించనున్న ప్రధాన మంత్రికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ధన్యవాదాలు తెలిపారు. భారత పౌరులు ABHA నంబర్ ద్వారా తమ ఆరోగ్య రికార్డులను ఒకే చోట ఉంచుకోగలరన్నారు. ABHA నంబర్ త్వరిత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కౌంట్ నంబర్ (ABHA నంబర్) దేశంలో డిజిటల్ హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. దేశప్రజలు తమ ఆరోగ్య రికార్డులను డిజిటల్ మార్గంలో ఎక్కడైనా యాక్సెస్ చేయగలుగుతారు. లడఖ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు లక్షద్వీప్‌లోని ఆరు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement