Monday, February 12, 2024

Big Fight in Hyderabad – ఇక్క‌డే.. ఫోక‌స్‌! ఈ 24 సీట్లూ అంద‌రికీ కీల‌కం…

హైదరాబాద్‌లో బిగ్ ఫైట్
అన్ని పార్టీల చూపు గ్రేట‌ర్‌పైనే
బీఆర్ఎస్, ఎంఐఎం కూటమికి ఆధిపత్య ఆరాటం
ఉనికి కోసం కాంగ్రెస్.. మనుగడ కోసం బీజేపీ
కమలదండుకు జ‌త అయిన‌ జనసైన్యం
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రెబెల్స్ బెడద
టీడీపీతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

భిన్నత్వంలో ఏకత్వం చాటే భారత‌ ప్రతిబింభం ఎలాగో… రాజకీయ చదరంగంలోనూ హైదరాబాద్ ముఖచిత్రమూ అంతే. అదే రకం ఫలితమూ సర్వసాధారణం. ఇక్కడ ఎవరిది ఆదిపత్యం, మరెవరిది బలహీనం అనేది అంచనాలకు అందనిది. తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత‌ జాతీయ, ప్రాంతీయ శక్తుల మధ్య అలుపెరగని పోరాటం జ‌రుగుతోంది. ప్రతి ఎన్నికల సమరంలో తారాస్థాయికి చేరుకోవటం, ఆపై జయాజయాలను జనం నిర్ణయించటం సర్వసామాన్యాంశమే. తాజాగా జరగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్‌లో పొలిటికల్ వార్ బిగ్‌ఫైట్‌ని త‌ల‌పిస్తోంది. హైదరాబాద్ సంస్థానంలో ఆధిపత్యం కోసం, విజయం కోసం రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు ప‌న్నుతున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. బీఆర్ఎస్ మ‌రోసారి గెలుపు కోసం వ్యూహాలు ప‌న్నుతుంటే.. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఉనికి కోసం ఆరాట‌ప‌డుతున్నాయి. ఈ చతుర్ముఖ పోటీ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో ఐదవ వంతు అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఓటర్లలో మూడో వంతు అంటే కోటికి పైగా ఓటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంటే శాసనసభలో అధికార పీఠాన్ని అధిష్టించాలంటే ఆయా రాజకీయ పార్టీలు హైదరాబాదీలను ఆకర్షించాల్సిందే. ప్రజల సంగతి సరే.. పార్టీల మధ్య మిత్రలాభం కోసం పొత్తులు తప్పని సరి. ఏదోక పార్టీ అధికార పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే. అప్పుడే హైదరాబాద్‌లో భిన్నత్వంలో ఏకతత్వం.. అధికారాన్ని శాసిస్తుంది. ఈ శత్రవు శ‌త్రువు.. మిత్రుడు అనే సూక్తికి.. హైదరాబాద్ అద్దం పడుతుందంటే అతిశయోక్తి కాదు.

- Advertisement -
   

పార్టీల్లో లబ్ డబ్.. లబ్ డబ్..
ఇక్కడ నాలుగు స్థంభాలాట ఉండదు. నలుగురి మధ్య పోరాటమే ఉంటుంది. యుద్ధం త‌ర్వాత ఇద్దరు మిత్రులు పాలిస్తారు. కానీ, అధికార పీఠంపై మిత్రులు అధిష్టిస్తారా? లేక బద్ధ విరోధుల్లో ఒక్కరికే చాన్ప్ వస్తుందా? ఇదీ హైదరాబాద్ రాజకీయాల్లో బుర్రను తొలిచేస్తున్న ప్రశ్న. ఈ సారి బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షం కాగా.. బీజేపీ, కాంగ్రెస్ ఈ మిత్రపక్షాన్ని ఢీకొంటున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్ రాజకీయాలను పరిశీలిస్తే.. దుర్భేద్య ఎంఐఎం కోటలో ఏ రాజకీయ పార్టీ అడుగు పెట్టే అవకాశమే లేదు. ఇక సీమాంధ్రుల అడ్డాలో.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. తమ ఉనికిని మాత్రమే కాపాడుకుంటుంటాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే ఫలితం ఉంటుందా? చిత్రం రంగులు మారుతుందా? అంటే బీజేపీ బలపడుతుందా? కాంగ్రెస్ స్థిరపడుతుందా? బీఆర్ఎస్ తన సత్తాను చాటుతుందా? ఒక్క ప్రశ్నకూ అసలు సిసలు సమాధానం వెల్లడి కావటం లేదు. నగర ప్రజల్లోని మర్మగర్భం రాజకీయ పార్టీల గుండెల్లో ల‌బ్ డ‌బ్ ల‌బ్ డ‌బ్ అనే వేగాన్ని పెంచుతోంది.

అటు ఆధిపత్యారాటం.. ఇటు ఉనికి కోసం పోరాటం
హైదరాబాద్ గడ్డలో.. ఈ సారి జరిగే ఎన్నికల్లో తమ ఆధిపత్యం కోసం ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తపన వర్ణనాతీతం. ప్రస్తుతం బీఆర్ఎస్, ఎంఐఎం కూటమి తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు 24 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రచారంలో దూసుకుపోతుంటే.. తనకు మిగిలన ఏకైక స్థానాన్ని తిరిగి నిలబట్టుకుని మరికొన్ని స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ యజ్ఙాల మీద యజ్ఞాలు చేస్తోంది. ఇక తాను కోల్పోయిన ఉనికిని, మనుగడను మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాజధాని నగరంలో తమ ఆధిపత్యం కోసం బీఆర్ఎస్, ఎంఐఎం దూకుడు పెంచితే.. బీజేపీ, కాంగ్రెస్‌లో.. ఒక పార్టీ మనుగడ కోసం, మరో పార్టీ ఉనికి కోసం తల్లడిల్లుతున్నాయి. ఎందుకంటే, తెలంగాణ ఆవిర్భావంతో తొలి ఎన్నికలు 2014లో రాజధాని నగరంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీకి నామమాత్ర బలమే కనిపించింది. టీడీపీ. బీజేపీ కూటమి ఏకంగా 14 సీట్లు కైవసం చేసుకుని కాలర్ ఎగరవేశాయి. ఇందులో టీడీపీ 9, బీజేపీ ఐదు స్థానాలను తమ జేబులో వేసుకుని రాజధానిలో తమకు తిరుగులేదని గంతులు వేశాయి. 2018 నుంచి రాజధాని హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయింది. కాంగ్రెస్‌తో జతగట్టిన టీడీపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. కాంగ్రెస్ కు రెండు, బీజేపీకి ఒకే ఒక స్థానం లభించాయి. బీఆర్ఎస్ 14 స్థానాలకు ఎగబాగితే.. 7 స్థానాలతో ఎంఐఎం తన స్థిర బలాన్ని చాటుకుంది. ఈ సారి సీమాంధ్రులపై ప్రభావం చూపించే తెలుగుదేశం హైదరాబాద్ బరిలో లేదు. ఎవరికి ఈ ఓట్లతో మద్దతు లభిస్తుంది? ఎవరికి నష్టం చేస్తుంది? ప్రస్తుత ఎన్నికల్లో.. ఈ అంకెలు మారుతాయా? అలాగే కొనసాగుతాయా? అనేవే ప్రస్తుతం నేతలను వేధిస్తున్న ప్రశ్నలు.

రాజధాని కోటలో పదేళ్ల పునాది..
పదేళ్ల కిందట 3 స్థానాలతో పునాది వేసిన టీఆర్ఎస్.. ప్రస్తుతం బలమైన బీఆర్ఎస్‌గా అవతరించింది. జీహెచ్ఎంసీ స్థానిక పాలనలో ప్రజలకు మరింత చేరువైంది. మౌలిక సదుపాయాల కల్సనలో.. ఎక్కడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు. అందుకే 2016లో ఒక డివిజన్, 2020లో రెండు డివిజన్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. ఇక బీజేపీ 2016లో నాలుగు డివిజన్లతో నాలుక కరచుకోగా.. 2020లో 48 స్థానాలకు దూసుకు వచ్చింది.. ప్రస్తుత ఎన్నికల్లో తన సత్తాను మరింత పెంచేందుకు తపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం తన పునాది బలాన్ని పటిష్టం చేసుకుంటోంది. సాధారణంగా నగర ప్రజానీకం మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, ఉపాధికే అవకాశం ఇస్తారు. ఈ మూడు అంశాల్లోనూ బీఆర్ఎస్ తనదైన శైలిలో రాజధాని ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ సారి 17 సీట్లనూ స్వీప్ చేయాలని ఉరుకులు పరుగులు పెడుతుంది. అయితే, సొంత పార్టీలోనే సిట్టింగ్‌ల‌పై అసంతృప్తి .. అదే విధంగా, తటస్థ ఓటర్లలో యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ వంటివి శాతాన్ని తగ్గించ‌వ‌చ్చ‌ని ప‌రిశీల‌క‌లులు చెబుతున్నారు.

బీఆర్ఎస్తో కాంగ్రెస్, బీజేపీ.. బిగ్ ఫైట్…
రాజధాని నగర పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్, ఎంఐఎం నల్లేరు మీద నడకలా ప్రచారంలో దూసుకు పోతుంటే.. ఇటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ప‌టాన్‌చెరు, కుత్బుల్లాపూర్, కూకట్‌ప‌ల్లి, ఎల్బీ నగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ముషీరాబాగ్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, స‌న‌త్‌న‌గ‌ర్‌, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇచ్చింది. మల్కాజ్‌గిరి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాల్లో కొత్త వారిని దించింది.

బీజేపీ, ఎంఐఎం..
ఇక.. బీజేపీ ఏకైక ఎమ్మెల్యేకు గోషామహ‌ల్‌లో మళ్లీ అవకాశం ఇచ్చింది. ఎంఐఎం తన వ్యూహాన్ని మార్చింది. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇచ్చి, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్‌లో కొత్త నాయకులకు అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనకు పార్టీ టిక్కెట్టు రాలేదనే మనస్థాపంతో రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మట్కాజిగిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ఎల్బీ న‌గ‌ర్‌లో మాజీ ఎంపీ మధుయాష్కీ, ముషీరాబాద్‌లో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌, మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కాంగ్రెస్‌ బరిలోకి దించింది. శేరిలింగంపల్లిలో మాజీ కార్పొరేటర్ వీ.జగదీశ్వర్ గౌడ్, ఖైరతాబాద్‌లో దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కూతురు, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది.

బీజేపీ నుంచి బ‌రిలో..
ఇక.. పటాన్ చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, కుత్బుల్లాపూర్లో మాజీ ఎమ్మల్యే కూన శ్రీశైలం గౌడ్, ఉప్పల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్, అంబర్‌పేట్‌లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సనత్‌న‌గర్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మల్కాజ్‌గిరీలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును బీజేపీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. అన్ని పార్టీల్లోనూ సిట్టింగ్ ఎమ్మల్యేలపై తిరుగుబాటు అభ్యర్థులు కత్తులు దూశారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో గడబిడ జరుగుతోంది. ఏది ఏమైనా.. ఇదంతా చూస్తుంటే రాజధాని పరిధిలో పొలిటికల్ వార్ మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా మారింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement