Friday, May 3, 2024

ఫోన్ సిగ్నల్ కష్టాలు.. ఆన్ లైన్ క్లాస్ కోసం ఐదు కిలోమీటర్లు

ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు ఓ చిన్నారి ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేస్తోంది. తన ఊర్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాకపోవడమే ఇందుకు కారణం. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎరుకున్నారు. ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఆన్‌లైన్ పాఠాలు వినటానికి ఓ చిన్నారి పడుతున్న కష్టం ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తుంది. ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడలోని గిరిజన కుటుంబానికి చెందిన సరస్వతి   పేరుకు తగినట్లే చదువంటే ఎంతో ఇష్టం. ఈ చిన్నారి  మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. కానీ, కరోనా వల్ల పాఠశాలలు ఏడాది కాలంగా మూతపడటంతో  టీచర్లు కొంత కాలంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు.

అయితే.. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ అందవు. దీంతో సరస్వతి తండ్రి రోజూ తన ఊరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో.. సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి తన కుమార్తెను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. తరగతులు పూర్తైన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొస్తున్నాడు. రహదారి పక్కన ఓ కల్వర్టు మీద చెట్టు నీడలో కూర్చొని తండ్రి మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ పాఠాలను చిన్నారి సరస్వతి వ వింటుంది. రోజు ఈ చిన్నారిని తండ్రి బైక్ మీద సిగ్నల్ వచ్చే ప్రాంతానికి తీసుకెళ్లి క్లాసులు వినిపిస్తున్నట్లు తల్లి తెలిపింది.

ఇలాంటి ఇబ్బందులు పడుతున్న చిన్నారులు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్థోమత లేక అనేక మంది చిన్నారులు ఆన్‌లైన్ పాఠాలకు దూరంగా ఉంటున్నారు. చిన్నారి సరస్వతి చదువు పై చూపెడుతున్న శ్రద్ద కు  ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని ఓ ప్రయివేట్ పాఠశాల నిర్వాహకులు  పదవ తరగతి వరకు ఉచితంగా బోధించేందుకు ముందుకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement