Thursday, April 25, 2024

Sports – క్రికెట్ ప‌సికూన ఐర్లాండ్ సంచ‌ల‌నం…. తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ లో ఘ‌న విజ‌యం …

ప్రపంచ క్రికెట్‌లో పసికూన అన్న ముద్రను ఇప్పుడిప్పుడే చెరిపేస్తున్న ఐర్లాండ్ తాజాగా మరో సంచలనం సృష్టించింది. ఆరేండ్ల క్రితం టెస్టు హోదా పొందిన ఆ జట్టు ఎట్టకేలకు రెడ్‌బాల్‌ క్రికెట్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్‌తో అబుదాబిలోని టోలరెన్స్‌ ఓవల్‌ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో ఆండ్రూ బల్బిర్ని సారథ్యంలోని ఐర్లాండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగుల ఛేదనను ఐర్లాండ్‌ విజయవంతంగా ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 155 పరుగులు చేయగా ఐర్లాండ్‌ 263 రన్స్‌కు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌కు 108 పరుగుల ఆధిక్య దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ 218 పరుగులకే పరిమితమవడంతో ఐర్లాండ్‌ ఎదుట 111 పరుగుల లక్ష్యం నిలిచింది. టార్గెట్ చేద‌న‌కు బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 13 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో ఐర్లాండ్‌ను బల్బిర్ని (96 బంతుల్లో 56 నాటౌట్‌, 5 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లొర్కన్‌ టక్కర్‌ (57 బంతుల్లో 27 నాటౌట్‌, 2 ఫోర్లు) విజయతీరానికి చేర్చారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించి ఐర్లాండ్‌కు చారిత్రక విజయాన్ని అందించారు. అఫ్గాన్‌ బౌలర్లలో నవీన్‌ జద్రాన్‌ ఆదిలోనే రెండు వికెట్లు తీసి భయపెట్టినా ఐర్లాండ్‌ నిలిచి గెలిచింది.

2018లో టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌.. ఆ ఏడాది పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడింది. ఆ తర్వాత 2018-19లో ఒక టెస్టు ఆడగా అందులోనూ పరాజయమే ఎదురైంది. ఆ తర్వాత 2019లో ఇంగ్లండ్‌తో, 2022లో బంగ్లాదేశ్‌తో, 2023లో శ్రీలంక, ఇంగ్లండ్‌లతో ఆ జట్టుకు పరాభవాలు తప్పలేదు. తాజాగా అఫ్గాన్‌తో జరిగిన టెస్టు ఐర్లాండ్‌కు ఏడోవది కావడం గమనార్హం. ఈ ఏడో టెస్టులో ఐర్లాండ్‌ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement