Sunday, April 28, 2024

Madhya Pradesh: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో కేఎల్‌ రాహుల్‌ ప్రత్యేక పూజలు

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఉదయాన్నే గుడికి వెళ్లిన రాహుల్‌.. భస్మా హారతి తర్వాత.. మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఆ సమయంలో రాహుల్‌ భార్య అతియా శెట్టి మాత్రం కనిపించలేదు. గతంలో ఈ ఆలయాన్ని సందర్శించినపుడు ఆమె రాహుల్‌ వెంట ఉంది.

కాగా గతేడాది ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌లో కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో లక్నో పగ్గాలు చేపట్టిన కృనాల్‌ పాండ్యా జట్టును ప్లే ఆఫ్స్‌ వరకు చేర్చినా.. కీలకపోరులో చేతులెత్తేశాడు. ఇదిలా ఉంటే.. తొడ కండరాల గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న రాహుల్‌ టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో వికెట్‌ కీపర్‌గానూ రాణించాడు. అయితే, ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈ క్రమంలో కేవలం ఒక్క మ్యాచ్‌ ఆడి.. మిగిలిన నాలుగు టెస్టులకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ లండన్‌ వెళ్లి వైద్య నిపుణులను సంప్రదించాడు. అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్‌నెస్‌ సాధించాడు. ఇక మార్చి 22న ఐపీఎల్‌-2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న లక్నో.. రాజస్తాన్‌ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ఐపీఎల్‌ బరిలో దిగేందుకు కేఎల్‌ రాహుల్‌ సిద్ధమయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement