Thursday, May 9, 2024

Asia Cup | పాక్‌తో భారత్‌ సూపర్‌ మ్యాచ్‌.. జట్టులోకి రాహుల్‌, బుమ్రా!

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరుగనున్న ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ఆసియా కప్‌ గ్రూప్‌ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుజట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సూపర్‌-4లో ఈ రెండు జట్లు మరోసారి తలపడుతుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. కానీ, ఈ మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు పొంచి ఉందని అధికారవర్గాల సమాచారం. మ్యాచ్‌ జరిగే సెప్టెంబర్‌ 10న కొలంబోలో 90శాతం వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో వర్షం కురిసే చాన్స్‌ ఎక్కువగా ఉందని జాతీయ మీడియాలో కూడా వార్తలొస్తున్నాయి.

రిజర్వ్‌ డే అయిన మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. దీంతో ఇరు జట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్‌కైనా వరుణుడు కరుణించాలని ప్రార్థిస్తున్నారు. పాకిస్తాన్‌తో జరిగే సూపర్‌-4 మ్యాచ్‌ కోసం కేఎల్‌ రాహుల్‌, జస్ప్రీత్‌ బుమ్రా ఇప్పటికే కొలంబో చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌, బుమ్రా రాణిస్తే వరల్డ్‌ కప్‌కు రూట్‌ క్లియర్‌ అయినట్లే. రాహుల్‌ మార్చి నుంచి వన్డే మ్యాచ్‌లు ఆడలేదు. జులై నుంచి బుమ్రా కూడా బంతి చేయపట్టలేదు. ఇక రాహుల్‌ భారత జట్టు తుది జట్టులో ఉండే అవకాశముందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

భారత్‌ (అంచనా): శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రశీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దిప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌

పాకిస్తాన్‌ (అంచనా): ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌-ఉల్‌-హఖ్‌, బాబర్‌ అజమ్‌ (కెప్టెన్‌), మహమ్మద్‌ రిజ్వాజ్‌ (వికెట్‌ కీపర్‌), అఘా సల్మాన్‌, ఇఫ్తిఖర్‌ అహ్మద్‌, సాదాబ్‌ ఖాన్‌, మహమ్మద్‌ నవాజ్‌/ ఫహీమ్‌ అష్రఫ్‌, షహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షాహ్‌, హరీస్‌ రవూఫ్‌

- Advertisement -

రాహుల్‌ ఇన్‌… సంజూ ఔట్‌
ఆసియా కప్‌లో భాగంగా రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికైన టీమిండియా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ ఇంటి ముఖం పట్టాడు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి చేరడంతో టీం మేనేజ్‌మెంట్‌ సంజూని ఇంటికి పంపించేసింది. దీంతో సంజూ శ్రీలంకను వీడి దుబాయ్‌కి వెళ్లిపోయాడు. నిజానికి ఆసియా కప్‌లో కేఎల్‌ రాహుల్‌ బ్యాకప్‌ గానే సెలక్టర్లు సంజూని ఎంపిక చేశారు. కేఎల్‌ రాహుల్‌ గత ఐపీఎల్‌ సమయంలో తొడ కండరాల గాయం బారిన పడి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉండటంతో మేనేజ్‌మెంట్‌ రాహుల్‌కు బ్యాకప్‌గా సంజూను ఎంపిక చేశారు. అయితే ఫిట్‌నెస్‌ పరంగా కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఫామ్‌లోకి రావడంతో ఇక సంజూ అవసరం లేదనుకున్న సెలక్టర్లు అతడ్ని శ్రీలంక నుంచి వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement