Tuesday, May 7, 2024

INDvsENG | రేప‌టినుంచి నాలుగో టెస్టు… సిరీస్ ల‌క్ష్యంగా బ‌రిలోకి భారత్..

భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. రాంచీ వేదికగా రేపు ( 23న‌- శుక్రవారం) ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సిరీస్‌లో 2–1తో వెనుకబడిన ఇంగ్లాండ్ నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఎలానైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆశిస్తోంది. ఇక మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. నాలుగో టెస్టులోనూ గెలుపొంది సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ గెలిస్తే స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్‌ విజయాలు భారత్‌ ఖాతాలో చేరతాయి.

రాణిస్తున్న యువ ఆటగాళ్లు..

మూడో టెస్టులో డబుల్ సెంచరీతో కదంతొక్కిన యశస్వీ జైశ్వాల్‌.. ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వన్‌ డౌన్‌లో గిల్‌, తర్వాత రజత్ పటిదార్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. సీనియర్ ఆల్‌రౌండర్‌ జడేజా, అరంగేంట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రాణించాలని జట్టు భావిస్తోంది.

వర్క్‌లోడ్‌తో పాటు భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో… ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఎవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది. బుమ్రా గైర్హాజరీలో జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌లతో కూడిన బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ ముందుండి నడపనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో నాలుగో స్పిన్నర్‌తో బరిలోకి దిగితే అక్షర్‌ పటేల్‌, సుందర్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది.

ఫలించని బజ్‌బాల్ వ్యూహం..

- Advertisement -

ఇంగ్లాండ్ “బజ్‌బాల్” వ్యూహం పనిచేయకపోవడంతో ఆ జట్టు ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాలుగో టెస్టు మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తున్న ఇంగ్లాండ్ జట్టు… కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. రెహాన్ అహ్మద్ స్థానంలో షోయబ్ బషీర్‌ను తీసుకుంది. స్పిన్ విభాగంలో టామ్ హర్ట్‌లీతో పాటు , సీనియర్ ఆటగాడు జోరూట్ బౌలింగ్ వేసే అవకాశముంది.

బ్యాటింగ్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్, కెప్టెన్‌ స్టోక్స్ రాణిస్తున్నప్పటికీ.. జో రూట్, బెయిర్‌స్టో బాగా ఆడాలని ఇంగ్లండ్ భావిస్తోంది. సీమ్ విభాగంలో సీనియర్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్ చేయనున్నాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ ముందంజలో ఉంది.

భారత జట్టు అంచనా :

రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్ , దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

ఇంగ్లాండ్ జట్టు అంచనా :

జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్‌ హార్ట్‌లీ, ఓలీ రాబిన్‌సన్, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్

Advertisement

తాజా వార్తలు

Advertisement