Sunday, May 19, 2024

TS | మార్చి 11 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు !

తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నారసింహుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 మొదలవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. పదకొండు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా చేపట్టే ధార్మిక, సాహిత్య, సంగీత, సాంస్కృతికోత్సవాలపై ఆలయ అధికారులు కసరత్తు మెుదలుపెట్టారు.

21వ తేదీన ముగింపు

మార్చి 11 తొలిరోజు ఆలయ ఉత్సవాలు విష్వక్సేన ఆరాధనతో మొదలై.. 11 రోజులపాటు కొనసాగి, ద్వాదశి రోజు మార్చి 21 ఉదయాన్నే గర్భాలయంలోని మూలవరులకు చేపట్టే సహస్ర కలశాభిషేకం మహాక్రతువుతో ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై త్వరలోనే రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆ శాఖ కమిషనర్‌ ప్రత్యేక సమావేశం కానున్నారు.

ఏర్పాట్లపై కసరత్తు

ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల సహకారానికి ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు దేవస్థానం లేఖలు రాసింది. సాంస్కృతిక కార్యక్రమాలను అయిదు రోజులపాటు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మూడ్రోజుల విశేష ఉత్సవాలు ఈ నెల 17న నిర్వహించే ఎదుర్కోలు సంబరంతో మొదలు కానున్నాయి. 18న రాత్రి శ్రీస్వామి, అమ్మవారల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ ఉత్తర ముఖంగా ఉన్న మాడవీధిలో చేపట్టనున్నారు. 19 నాటి రాత్రి దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు.

- Advertisement -

8న అఖండజ్యోతి యాత్ర

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగ్యనగరంలో బర్కత్‌పుర నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండజ్యోతి యాత్ర మార్చి 8న మొదలవుతుందని జ్యోతియాత్ర కమిటీ ఛైర్మన్‌ సద్ది వెంకట్‌ రెడ్డి వెల్లడించారు. అక్కడి నుంచి బయల్దేరిన జ్యోతియాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల ప్రచారం నిర్వహిస్తూ ఉత్సవాల అంకురార్పణ రోజు ఇక్కడికి చేరుకుంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement