Friday, May 17, 2024

హరితహారం: నర్సరీల్లో పనులు ముమ్మరం.. రెండో విడతలో 70 అర్బన్‌ ఫారెస్టు పార్కులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది వర్షా కాలం నుంచి ప్రారంభించనున్న ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలను పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో పనులను ముమ్మరం చేశారు. ఏ ఏ గ్రామ పంచాయతీల్లో ఎన్ని మొక్కలను పెంచాలనే నిర్దేశిత లక్ష్యాన్ని ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఇప్పటికే నర్సరీ నిర్వహకులు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో నర్సరీలో కనీసం 25 వేల నుంచి 30 వేల వరకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అధికంగా నీడనిచ్చేవి, పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రతి నర్సరీలో కనీసం 50 రకాల పండ్లు, పూల జాతి మొక్కలను పెంచుతున్నారు. అందులో భాగంగా నీడనిచ్చే వేప, బాదం, టేకు వంటి మొక్కలు, పండ్ల జాతి మొక్కల్లో దానిమ్మ, జామ, నిమ్మ, ఉసిరి వంటి మొక్కలను పెంచుతున్నారు. అలాగే ఇండ్ల పరిసరాల్లో నాటేందుకు అవసరమైన పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఉపాధి కూలీలతో నర్సరీల్లోని మొక్కలను సంరక్షిస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే అటవీ భూముల రక్షణలో భాగంగా అర్బన్‌ పార్కులను అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాదిలో రెండవ విడత కొత్త అర్బన్‌ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.77 లక్షల ఎకరాల్లో పచ్చదనం పెంచేందుకు 70 అర్బన్‌ పార్కులను ఏర్పాటుకు అటవీశాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే మొదటి విడత చేపట్టిన 109 అర్బన్‌ ఫారెస్టు పార్కుల్లో 53 పూర్తి అయ్యాయి. వాటిలో 37 పార్కుల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

మరో 16 పార్కులు అందుబాటులోకి రానుండగా, మిగిలిన 56 పార్కులు అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగుతూ గత ఏడాది లక్ష్యాన్ని మించి ఫలితాన్ని సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని పెట్టుకోగా, అంతకు మించి 242 కోట్ల మొక్కలను నాటారు. దీంతో 2015 నుంచి 2021 సంవత్సరం వరకు తెలంగాణలో 7.7 పచ్చదనం పెరిగినట్లు ఇండియన్‌ స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్టు తన నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement