Friday, May 3, 2024

Exclusive | కట్టుకున్న చీరే ఆయుధం.. జైలు నుంచి తప్పించుకున్న మహిళా ఖైదీ!

నేపాల్​ నుంచి భారత్​లోకి అక్రమంగా చరస్​ (మత్తు పదార్థం) తీసుకువస్తున్న మహిళను అరెస్టు చేసి రిమండ్​ ఖైదీగా జైలులో ఉంచారు. రెండున్నరేండ్లుగా జైల్లో ఉంటున్న ఆమె నిన్న (ఆదివారం) రాత్రి జైలు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంది. జైలు నుంచి పరారు కావడానికి 15 అడుగుల గోడను ఈజీగా దాటేసింది. దీనికి ఆమె ఒంటిపై ఉన్న చీరను ఉపయోగించినట్లు జైలు అధికారులు భావిస్తున్నారు. ఆమె కోసం సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్) కింద జ్యుడీషియల్​ రిమాండ్​లో ఉన్న ఓ 25 ఏండ్ల మహిళ తప్పించుకుంది. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌ జైలు నుండి 15 అడుగుల ఎత్తైన గోడను ఎక్కడానికి తన చీరను ఉపయోగించి తప్పించుకున్నట్టు జైలు అధికారులు భావిస్తున్నారు. పిథోరఘర్ పోలీసు సూపరింటెండెంట్ లోకేశ్వర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆకృతి అలియాస్ అనుష్క అనే నేపాల్​ మహిళను తాత్కాలిక నిర్బంధ కింద జైలులో ఉంచారు. ఏప్రిల్ 2021లో నేపాల్ నుండి చరస్‌ను అక్రమంగా రవాణా చేసినందుకు ధార్చులలో ఆమెను అరెస్టు చేశారు. ఆ తరువాత రెండున్నర సంవత్సరాలుగా ఆమె జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంటోంది.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పారిపోయిన ఈ నేపాల్​ మహిళా ఖైదీని 2021లో అరెస్టు చేసినప్పుడు ఆమె శరీరానికి 1.2 కిలోల చరస్‌లను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పారిపోయిన ఖైదీని పట్టుకునేందుకు పోలీసులు ఇండో-నేపాల్ సరిహద్దులు, జిల్లా సరిహద్దుల్లోని అన్ని పాయింట్లను అప్రమత్తం చేశారని, సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

- Advertisement -

జైలు ప్రాంగణం నుంచి తప్పించుకోవడానికి ఆమె అనుసరించిన వ్యూహాలు, మార్గాలను అర్థం చేసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే.. జైలు నుంచి తప్పించుకున్న ఆ మహిళ పితోర్‌గఢ్ పట్టణంలో ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో ఆమె కోసం 11 పోలీసు బృందాలను పంపినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

పితోర్‌ఘర్ జిల్లాలో జైలు లేదని, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది వ్యక్తులు ఓ లాకప్‌లో బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 90 మంది దోషులు విచారణ కోసం ఎదురుచూస్తున్నందున, లాకప్ ప్రస్తుత సామర్థ్యం 35 కంటే ఎక్కువగా ఉందని ఒక అధికారి తెలిపారు. పితోర్‌గఢ్‌ తహసీల్దార్‌ జైలు బాధ్యతలు నిర్వహిస్తుండగా, పితోర్‌గఢ్‌ పోలీసులు భద్రతను చూస్తున్నారు. ఇక.. అనుష్క ఏప్రిల్ 2021లో ధార్చుల సస్పెన్షన్ బ్రిడ్జిని దాటి భారతదేశంలోకి వచ్చినప్పుడు శాస్త్ర సీమా బాల్ (SSB) మహిళా కానిస్టేబుళ్లు ఆమెను ఆపి తనిఖీ చేయగా చరస్​ దొరికినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement