Friday, June 14, 2024

కాసులు కురిపిస్తున్న కోళ్ల వ్యర్థాలు.. అక్ర‌మ ర‌వాణా ఆగేదెప్పుడు?

పెదపాడు మే 11 (ప్రభ‌ న్యూస్) : పెదపాడు మండలంలో ఉన్న కొల్లేరు ప్రాంతాల్లో ఉన్న చేపల పెంపకం దారులు ప్రతిరోజు కోళ్ల వ్యర్ధాలను ఉపయోగిస్తున్నా మండల స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు టన్నులకొలది కోళ్ల పేగులు, త‌ల‌, చ‌ర్మం ఇలా వ్యర్థాల‌ను ఇక్కడ చేపల చెరువుల యజమానులు ఉపయోగిస్తున్నా ఎక్కడ వాటిని నిరోధించిన దాఖలాలు కానరావడం లేదు. మండల స్థాయిలో ఏ ఒక్క అధికారి చేపల చెరువుకి కోళ్ల వ్యర్ధాలు తరలిస్తున్న వాహనాలకు నిరోధించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనబడటం లేదు. జిల్లా స్థాయిలో అధికారులు చెప్పినప్పుడు మాత్రం నామమాత్రపు తనిఖీలతో కూడిన హడావుడి చేయటం తప్ప ఏ ఒక్క చేపల చెరువు యజమానిపై, వ్యర్ధాలు సరఫరా చేస్తున్న వాహనం పైన చట్టపరమైన చర్యలు తీసుకుని నిరోధించవలసిన ప్రక్రియ జ‌ర‌గ‌డం లేదు. కోళ్ల వ్యర్ధాలు సరఫరా చేసే వాహనాలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతూ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల్లో వ్యర్ధాలన్నీ కొల్లేరు ప్రాంతాలకి చేరవేసి రోజు లక్షల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదిస్తున్న వారిపై ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదు కాలేదు. చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే కంటైనర్ బాక్సులని కొనుగోలు చేసి వాటి ద్వారా ఎవరికి కనపడకుండా కోళ్ల వ్యర్ధాలను పెదపాడు మండలంలో ఉన్న చాపల చెరువులకి ప్రతినిత్యం సరఫరా చేస్తున్నారు. వారిపై పైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ప‌లువురు కోరుకుంటున్నారు. కంటైనర్ బాక్సుల్లో కోళ్ల వ్యర్ధాలు రవాణా అవుతున్నప్పుడు లోపల నుంచి దుర్వాసన వస్తే తప్ప అందులో ఏముందో ఎవరికి తెలియదు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెదపాడు మండలంలో కోళ్ల వ్యర్ధాలను సరఫరా నిరోధించడానికి కొన్నిచోట్ల తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గతంలో చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేసినప్పుడు కొల్లేరు ప్రాంతాల్లో వ్యర్థాలు సరఫరా చేయడం చాలా కఠినతరమైంది. ఇదే విధంగా చెక్ పోస్టులు పర్మినెంట్ గా ఉంటే కొల్లేరు పరిరక్షించడం జరుగుతుందని పలువురు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement