Friday, May 17, 2024

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి సహకరిస్తాం : మంత్రి తలసాని

బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్దికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మున్సిపల్ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ యాదవ్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, కలెక్టర్ అమయ్ కుమార్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ కమిటీ వైస్ చైర్మన్ రఘురాం రెడ్డి, సభ్యులు పయాజ్ ఖాన్, వినోద్ లతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రికి విన్నవించగా, అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.

హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలోనే ఈ స్కూల్ కు ఎంతో గుర్తింపు ఉన్నదన్నారు. అలాంటి స్కూల్ మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఈ స్కూల్ లో చదువుకున్న వారిలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా, వివిధ ప్రభుత్వ శాఖలలో, రాజకీయ నాయకులుగా అనేక హోదాలలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారని వివరించారు. స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం కోసం ప్రతిపాదనలను అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ స్కూల్ లో తమ పిల్లలను చేర్పించాలనే ఆలోచనతో అనేక మంది తల్లిదండ్రుల నుండి అడ్మిషన్ ల కోసం తీవ్రమైన ఒత్తిడులు ఉన్న నేపధ్యంలో స్కూల్ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని మంత్రికి వివరించగా, తప్పనిసరిగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్దికి సహకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, RDO వసంత, ఇంచార్జి జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement