Friday, May 17, 2024

5జీ ఫోన్లు కావాలి.. కంపెనీలను కోరిన ప్రభుత్వం

దేశంలో 5జీ సేవలు ప్రారంభమైనందున కంపెనీలు ఇందుకు అనుగుణంగా ఉండే ఫోన్ల ఉత్పత్తిని పెంచాలని, ఉన్నవాటిని అప్‌గ్రేడ్‌ చేయాలని కంపెనీలను ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ఐఫోన్‌ 14, సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన హై ఎండ్‌ ఫోన్లు 5జీకి సపోర్టు చేయడంలేదు. వీటితో పాటు అనేక కంపెనీల ఫోన్లు కూడా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం కోరింది. దీనికి ప్రాధాన్యత ఇచ్చి సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచించింది. 5జీకి సపోర్టు చేసే ఫోన్లు చాలా తక్కువగా ఉండడం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 1 నుంచి దేశంలో 5జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు ఈ సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని నగరాలకే పరిమితమైన 5జీ సేవలు క్రమంగా దేశమంతా విస్తరించనున్నాయి.

5జీ సేవలను వేగంగా విస్తరించేందుకు టెలికం కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. మరో వైపు ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు ఇందుకు అనుగుణంగా ఫోన్లను మార్కెట్‌లో విడుదల చేయడంలేదు. ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్‌ 14 కూడా 5జీ సేవలకు సపోర్టు చేయదు. టెలికం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు ఇటీవల టెలికం కంపెనీలు, మొబైల్‌ తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధులను సమావేశం అయ్యారు. 5జీ సేవలు వినియోగదారులకు చేరవేయడానికి ప్రధానమైన ఫోన్లు అప్‌డేట్‌ కాకపోవడం పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. అన్ని కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకుని 5జీ ఫోన్లను తయారు చేయాలని అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement