Friday, May 17, 2024

Delhi | ఢిల్లీలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: యువతరానినికి వివేకానంద జీవిత చరిత్ర ఎంతో స్పూర్తినిస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తదితరులు స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు వివేకానంద అని కొనియాడారు. నేటి యువత స్వామి వివేకానంద జీవిత చరిత్ర తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల్లో పరివర్తన తీసుకొచ్చిన భారతీయ శక్తి వివేకానంద అని గుర్తు చేశారు.

సామాజిక స్ఫూర్తి ఉన్న ఎవరైనా స్వామి వివేకానంద చరిత్ర చదవాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల పుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా ప్రతి వివేకానంద గురించి తెలుసుకోవాలని జూపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిభ్‌కో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిబ్‌కో ఛైర్మన్ చంద్రపాల్ సింగ్,  ఢిల్లీ కో ఆపరేటివ్ బ్యాంకు ఎండీ అనితా రావత్ తదితరులు సన్మానించారు. గతంలో క్రిబ్‌కో సభ్యులుగా ఉన్న పొన్నం ప్రభాకర్ మంత్రి కావడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement