Sunday, May 5, 2024

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ.. కేంద్ర సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక ప్రణాళిక ప్రకారం కాంపా కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులను విడుదల చేయాల్సిందిగా ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. అడవుల పెంపకం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వార్షిక ప్రణాళికలకు ఆమోదం తెలిపి కాంపా నిధుల కింద గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు.

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.3,110 కోట్ల నిధులను 2019-20 సంవత్సరంలో విడుదల చేయడం చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. 2019-20 నుంచి 2021-22 వరకు గత 3 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే ఆమోదం పొందిన వార్షిక ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పార్కులు, జంతు ప్రదర్శనశాలల నిర్వహణ కోసం కూడా వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల విడతలవారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని, ఇప్పటివరకు గత కొన్నేళ్లలోనే దాదాపు రూ. 30 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్టు లేఖలో ప్రస్తావించారు. .

ఈ నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, అంతేకాకుండా, ఆయా పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన రూ.2.20 కోట్ల నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేసీఆర్‍కు వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్ర పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ తన లేఖల పర్వం కొనసాగుతోందని చెప్పారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబానికి మరోసారి అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ధ్యాసే లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement