Friday, May 10, 2024

పెను విల‌యం – ట‌ర్కి, సిరియాల‌లో ఘోర‌క‌లి

టర్కీ, సిరియాలపై పుడమి తల్లి ప్రకోపించింది. వేకువ జామున కొద్ది క్షణాలు వొళ్లు విరిచింది. అంతే.. నిముషాల వ్యవధిలో శక్తివంతమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాలను వణికించాయి. పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వాటి సమీపంలోని ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి. భారీ శబ్దాలు.. దట్టమైన ధూళి మేఘాలతో మహా విలయం సంభవించింది. ఏం జరిగిందో తెలిసేలోపే వేలాది మంది గాఢ నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మెలకువలో ఉండి ముప్పును పసిగట్టిన వాళ్లు భయంతో పరుగులు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లనుంచి రోడ్లపైకి చేరుకున్నారు. ఇంకొందరు గాయాలతో బయటపడ్డారు. శిథిలాల దిబ్బలైన ఇళ్లు, గాయపడిన వారి రోదనలు, ఆత్మీయులను కోల్పోయిన వారి ఆర్తనాదాలు, అంబులెన్సుల సైరన్‌ మోతలతో భూకంప బాధిత ప్రాంతాలు రుద్రభూమిని తలపించాయి. మధ్యాహ్నం వేళ మరో రెండు భూకంపాలు టర్కీకి తాకాయి. సోమవారం సంభవించిన వరుస భూకంపాలు టర్కీకి చారిత్రక విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తుకు రెండున్నర వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 13వేల మంది క్షతగాత్రులయ్యారు. మూడువేల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఊహకందని విషాద ఘటనపై యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. టర్కీ, సిరియా దేశాలకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. రెస్క్యూ, వైద్య బృందాలను పంపుతున్నట్లు ప్రకటించాయి.

న్యూఢిల్లి : ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలం అయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం మూడు భూకంపాలు సంభవించాయి. మృతుల సంఖ్య 2700 దాటింది. 24 గంటల వ్యవధిలో మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. తెల్లవారు జామున మొదటి భూకంపం సంభవించింది. దక్షిణ టర్కీలోని గజియాన్‌ టెప్‌ సమీపంలో 4.17 గంటల సమయంలోభూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. మధ్యాహ్నం 1.24 గంటలకు 7.5 తీవ్రతతో రెండవ భూకంపం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 6.0 తీవ్రతతో మూడోసారి భూమి కంపించింది. శక్తివంతమైన ఈ భూకంపాల తాకిడికి వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల దిబ్బలు, మృతదేహాలు, క్షతగాత్రులతో కిక్కిరిసిన ఆస్పత్రులు, చిన్నారుల ఏడుపులు, ఆర్తనాదాలు, అంబులెన్సుల సైరన్‌ మోతలతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్నవారిని రక్షించేందుకు రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు రెండు దేశాల్లో దాదాపు 4 వేల మంది పైగా మరణించారు. దాదాపు 25 వేల మంది గాయపడ్డారు. 3134 భవనాలు నేలమట్టం అయ్యాయి. టర్కీ కాలమానం ప్రకారం, తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని అనేక ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. టర్కీలోని దియర్‌బకీర్‌, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. భవన శిథిలాల నుంచి 2400 మందికిపైగా రక్షించారు. భూకంప ప్రభావానికి ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌, విద్యుత్‌ సౌకర్యాలకు అంతరాయం కలిగింది. ఈశాన్య టర్కీలో 1999లో సంభవించిన భారీ భూకంపంలో 17000 మందికిపైగా మరణించారు. ఆతర్వాత ఈస్థాయిలో భూకంపం విరుచుకు పడటం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.

గంటల వ్యవధిలో మరోసారి…
భూకంప విషాదం తెలిసేలోపే టర్కీని మరో విపత్తు వణికించింది. మొదటి ఘటన అనంతరం కొద్ది గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు ఏర్పడ్డాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.24 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైందని అమెరికా భౌగోళిక సర్వే తెలిపింది. మొదటి భూకంప కేంద్రానికి ఉత్తరంగా 60 మైళ్ల దూరంలో ఉంది. ఆగ్నేయ టర్కీలోని ఎకినోజు ప్రాంతానికి 4 కి.మీ. దూరంలో 10కి.మీ లోతులో దీని భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

మృత్యుఘోష…
తెల్లవారుజామున విలయం సంభవించింది. ఆ సమయంలో పౌరులు గాఢ నిద్రలో ఉన్నారు. దాంతో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదైంది. టర్కీలో మొత్తం 10 ప్రావిన్సులలో భూకంపం విలయం సృష్టించగా, 1651మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫర్హెతిన్‌ కొకా వెల్లడించారు. 11,200 మందికిపైగా గాయపడినట్లు చెప్పారు. దాదాపు 3వేల భవనాలు నేలమట్టం అయినట్లు సమాచారం. ఇక సిరియాలో మొత్తంగా 968 మంది మరణించారు. ప్రభుత్వ నియంత్రణలోని ప్రాంతాల్లో 538 మంది మృతిచెందగా, 639 మంది వరకు గాయపడ్డారు. రెబెల్స్‌ ఆధీనంలోని ప్రాంతాల్లో కనీసంగా 430 మందికిపైగా మరణించి నట్లు సమాచారం. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకు న్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ టర్కీలోని ప్రభావిత ప్రాంతాలకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకు వీలుగా సాయుధ దళాలు ప్రత్యేక వైమానిక కారిడార్‌ను తెరిచాయి. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణమంత్రి హులుసి అకర్‌ తెలిపారు.

- Advertisement -

ఆస్పత్రులు కిటకిట…
వందలాది మంది క్షతగాత్రులకు ఏకకాలంలో సేవలు అందించాల్సి రావడం ఆస్పత్రులకు సవాల్‌గా మారింది. అత్యవసర విభాగాలు నిండిపోయాయి. సాధారణ గాయాలకు ప్రాథమిక చికిత్స అందించడానికి కూడా వీలుకాని పరిస్థితులు తలెత్తాయి. రద్దీగా ఉండే ఓ ఆస్పత్రి గదిలో గాయపడిన వ్యక్తులు మంచాలపై పడుకున్నారు.కొందరు తలకు కట్టుతో ఉన్నారు. మరికొందరు గాయాలకు చికిత్స పొందుతున్నారు. ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురు రోగులు ఉన్నారు. కొందరు కాళ్లు విరిగి పడివున్నారు. ఈవిషాదం యుద్ధం కంటే ఘోరమైనదని బాధితులు చెప్పుకొచ్చారు.

3 రోజుల ముందే హెచ్చరిక..
భూకంప ముప్పుపై మూడు రోజుల కిందటే నిపుణులు హెచ్చరిం చినట్లు తెలుస్తోంది. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్‌, లెబనాన్‌లలో భారీ ప్రకంపనలు సంభవించొచ్చని సంకేతాలిచ్చారు. భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్‌ సిస్టమ్‌ జియోమెట్రీ సర్వే సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్‌ హుగర్‌బీట్స్‌.. తాజా విపత్తును ముందే అంచనా వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. 7.5 తీవ్రతతో ప్రకంపనలు రావొచ్చంటూ ఫిబ్రవరి 3నే ట్వీట్‌ చేశారు. ఆయన అంచనాలు నిజమై భారీ విధ్వంసాన్ని, మారణహోమాన్ని మిగిల్చాయి. విషాద ఘటనపై హుగర్‌ బీట్స్‌ స్పందిస్తూ, ఈ సంఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. త్వరలోనే భూకంపం వస్తుందని ముందే చెప్పానని, అది 115 ఏళ్ల నాటి తీవ్రతను కలిగివుంటుందని పేర్కొన్నారు. గ్రహ సంబంధిత సంక్లిష్టరేఖా గణితం ఆధారంగా వీటిని అంచనా వేశామని తెలిపారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు.

బాసటగా ప్రపంచ దేశాలు
ప్రకృతి వైపరీత్యానికి భారీగా నష్టపోయిన టర్కీ, సిరియా దేశాల పరిస్థితిపై యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆ దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తు న్నాయి. భారత్‌ సహా నెదర్లాండ్‌, గ్రీస్‌, సెర్బియా, స్వీడన్‌, ఫ్రాన్స్‌తదితర 45 దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలవంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి. నాటో, యూరప్‌ యూనియన్‌ సహాయం అందిస్తున్నాయి. 76 రెస్క్యూ బృందాలను పంపుతు న్నట్లు యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్‌ క్లీవర్డీ చెప్పారు. టర్కీ, సిరియాలోని అత్యవసర వైద్యబృందాల నెట్‌వర్క్‌ను డబ్ల్యుహెచ్‌ఒ అప్రమత్తం చేసింది. యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలకు ఆదేశించామని, ఈ బృందాలు ప్రమాద స్థితిలో ఉన్న వారికి ఆరోగ్య సేవలను అందిస్తాయని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ అథనామ్‌ టెడ్రోస్‌ చెప్పారు.

మోడీ ఆపన్న హస్తం…
ప్రధాని మోడీ ఆదేశాల మేరకు టర్కీలో తక్షణ సహాయక చర్యల నిర్వహణకు భారత్‌ నుంచి ప్రత్యేక బృందాలు బయ ల్దేరాయి. ఎన్‌డీఆర్‌ ఎఫ్‌ బృందాలతోపాటు వైద్య సిబ్బందిని, అవసరమైన సామగ్రిని పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్ల డించింది. సహాయక చర్యలపై ప్రధానమంత్రికి చీఫ్‌ సెక్రటరీగా ఉన్న పీకే మిశ్రా సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 100 మంది సిబ్బందితో కూడిన రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, డాగ్‌స్క్వాడ్‌లు, అవసరమైన పరికరాలు, వైద్య సామగ్రిని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపాలని నిర్ణయించారు. వైద్యబృందాలు సహాయ సిబ్బందితోపాటు ఔషధాలు కూడా చేరవేయనున్నారు. టర్కీ ప్రభుత్వం, అంకా రాలోని భారత రాయబార కార్యాలయం, ఇస్తాం బుల్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. అంతకు ముందు భూకంప విలయంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్కర పరిస్థితులలో ఆయా దేశాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement