Tuesday, June 18, 2024

TS – 70 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది – రేవంత్ రెడ్డి

హైదారాబాద్ – కొత్తగా ఎంపికైన గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉద్యోగ నియామకాలను చేపట్టకుండా బీఆర్ఎస్ ఎంతో నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

గురుకుల ఉపాద్యాయులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ కుటుంబంలో ఉద్యోగాలు ఊడగొట్టినందుకే ఇప్పుడు నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. ఉద్యోగాలు లభిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ అన్యాయాలను రాష్ట్ర ప్రజలు గమనించారనీ.. అందుకే కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించారని చెప్పారు. ఉద్యోగ నియామకాలను పట్టించుకోని కేసీఆర్ సర్కార్.. కేవలం దోచుకోవడం.. దాచుకోవడంపైనే దృష్టి పెట్టారంటూ ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడబట్టే మేడిగడ్డ బ్యారేజ్‌ పేకమేడలా కూలిపోయే పరిస్థితి దాపురించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ నాయకులపై మండిపడ్డారు.

ఉద్యోగ నియామకాల చిక్కుముడులను విప్పుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25వేల ఉద్యోగ నియామకాలను చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం విద్య రంగం కోసం ఖర్చు చేసింది ఆరు శాతమే అనీ.. తాము ఇప్పుడు 12 శాతానికి పెంచామన్నారు. గురుకులాలను బలోపేతం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కు కాళ్ల నొప్పులొస్తాయని ఎద్దేవా చేశారు. నల్గొండకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి నొప్పులు ఉండవని మండిప‍డ్డారు. హరీశ్‌కు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాల్సిందేనని అన్నారు. పదేళ్లు చేసిందేమీ లేదు.. మేము రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు.

మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీశ్‌ అంటుండు. హరీశ్‌రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్‌ ఏం చేశారు?. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. దశ బాగుంటే దిశతో పని లేదు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి అని. సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement