Wednesday, May 1, 2024

TS: తేల్చుకుందాం రా… రేవంత్ కు డీకే అరుణ స‌వాల్…

మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని.. మహిళా అన్న ఇంగితలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారని.. సోయిలేకుండా రాక్షసులు..రాబంధువులలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏది మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకుంటుంద‌ని అనుకుంటువ్నానా.. ఓటుకు నోటుకు కేసులో జైలుకు పోయిన చరిత్ర నీది. నీ బాగోతంపై చర్చించేందుకు నేను సిద్దం.. మీరు సిద్దమా’’ అంటూ సవాల్ విసిరారు. పదేళ్లకిందటి రేవంత్ రెడ్డిగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి పదవికే అవమానమన్నారు. సేవ అంటే సీఎంకు అర్ధం తెలుసా అని ప్రశ్నించారు.

‘‘మహిళను అవమానం చేసేలా మాట్లాడుతున్నారు… నన్ను పండపెట్టితొక్కుతారా రండి చూద్దాం’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో సీఎం మహబూబ్‌నగర్‌లో నామినేషన్ కోసం వచ్చారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద పదిలక్షల రూపాయలు ఉచితంగా ఎంతమందికి ఇచ్చారో జాబిత విడుదల చేయాలని… అందులో ఆయుష్మాన్ భారత్ నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. మొదట ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే సీఎం తన పగవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 15 రోజుల్లో స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రమాణం చేస్తారా అని అడిగారు. సీఎం ప్రతిసారి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రచేస్తున్నారని మొసలి కన్నీరుకారుస్తున్నారని విమర్శించారు. ఇకనైనా సీఎం తన స్థాయికి తగినట్టుగా మాట్లాడం నేర్చుకోవాలని డీకే అరుణ హితవుపలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement