Friday, April 26, 2024

మాజీ మంత్రి ఈటెలపై ‘ఆపరేషన్ గంగుల’

తెలంగాణ‌లో రాజ‌కీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ జ‌రుగుతున్నాయి. ఈటెల రాజేంద‌ర్‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయాలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయి. బ‌ర్త‌ర‌ఫ్ అయిన వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గానికి భారీ కాన్వాయ్‌లో వెళ్లిన ఈటెల త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. వారంతా ఈటెల వెంటే ఉంటామ‌న్నారు. దీంతో టీఆర్ ఎస్ అధిష్టానం అల‌ర్ట్ అయింది. వెంట‌నే మంత్రి గంగ‌ల క‌మ‌లాక‌ర్‌ను రంగంలోకి దింపింది.

కరీంన‌గ‌ర్‌లోని త‌న క్యాంప్ ఆఫీస్‌కు వ‌రుస‌గా హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత‌ల‌ను పిలుస్తూ గంగుల కమలాకర్ మంతనాలు జరుపుతున్నారు. పార్టీ వెంట ఉంటే ప‌ద‌వులు, నామినేటెడ్ పోస్టులు, ఇత‌ర బ‌హుమ‌తులు ఇస్తామంటూ ఆఫ‌ర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్లు, ప‌లువురు కీల‌క నేత‌లు, ఈటెల అనుచ‌రులైన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్ల‌ను మంత్రి త‌న క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించి మాట్లాడారు. దీంతో వారంతా పార్టీ వెంటే న‌డుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వ‌రుస‌గా ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ ఈటెలను విమ‌ర్శిస్తున్నారు. అయితే తాము మాత్రం ఈటెల వెంటే న‌డుస్తామ‌ని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మ్యాకల ఎల్లారెడ్డి, జమ్మికుంట వైస్ ఛైర్ ప‌ర్స‌న్ దేసిని స్వ‌ప్న ప్ర‌క‌టించారు. ఇక పార్టీ వెంట న‌డ‌వ‌ని వారిని ఆక‌ర్షించేందుకు క‌రోనా తీవ్ర‌త త‌గ్గాక మంత్రి కేటీఆర్‌తో క‌లిసి హుజూరాబాద్‌లో ప‌ర్య‌టించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్లాన్ చేస్తున్నారు‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement