Saturday, May 11, 2024

ప్రయాణించినంత దూరానికే టోల్‌ టాక్స్‌.. ఫాస్టాగ్‌కు చెల్లుచీటీ?

వాహనాల యజమానులకు త్వరలో తీపికబురు అందనుంది. ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ పన్ను వసూలు చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం జాతీయ రహదారులపైకి ఎక్కితే చాలు టోల్‌ పన్ను వడ్డన తప్పడం లేదు. టోల్‌ పన్నుల వసూలులో ఫాస్టాగ్‌ విధానం వచ్చాక చెల్లింపులు సులభతరమైనాయి. టోల్‌గేట్లవద్ద ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రయాణంలో జాప్యం తగ్గింది. అయితే ఒకసారి రోడ్డెక్కాక.. ఒక టోల్‌ గేట్‌ దాటాక.. తర్వాత వచ్చే టోల్‌గేట్‌వరకు వెళ్లకపోయినా అక్కడివరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇకముందు ఆ విధానం మారబోతోంది.

మున్ముందు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అంత దూరానికే టోల్‌ పన్ను విధించబోతున్నారు. ప్రస్తుత ఫాస్టాగ్‌ విధానాన్ని ఎత్తివేయబోతున్నారు. టోల్‌ పన్నుల వసూళ్లకు సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ వాహనం ఎంత దూరం ప్రయాణించిందన్నది గుర్తించడానికి జీపీఎస్‌ శాటిలైట్‌ టెక్నాలజీని వినియోగించబోతున్నారు.

ప్రయాణించిన దూరాన్నిబట్టి టోల్‌ టాక్స్‌ విధిస్తారు. కొత్త విధానంపై ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల ఎత్తివేస్తామని మార్చి నెలలో పార్లమెంట్‌లో కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. టోల్‌ప్లాజాల స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌పన్ను వసూలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు అప్పట్లో చెప్పారు. ఐరోపా దేశాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో మనదేశంలోనూ అమలు చేయాలని పైలట్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 1.37 వాహనాలను కొత్త విధానానికి అనుగుణగా మార్చారు. 2016లో మనదేశంలో ఫాస్టాగ్‌ విధానం అమల్లోకి వచ్చింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement