Thursday, April 25, 2024

Telangana | దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థలో సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకం.. 54వ​ వ్యవస్థాపక వేడుకల్లో అమిత్ షా

పటిష్ఠమైన భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్​లో సీఐఎస్​ఎఫ్ 54వ​ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేసే వైఖరిని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పటిష్ఠమైన భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కేంద్ర పారిశ్రామిక దళానిది కీలకపాత్ర అని అమిత్‌ షా స్పష్టం చేశారు. 1969 మార్చి 10న 3వేల సిబ్బందితో ప్రారంభమై.. లక్షా 80 వేల మందికి చేరుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పవర్ ప్లాంట్స్, జాతీయ పారిశ్రామిక భవనాలకు భద్రత కల్పిస్తోందన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై 9ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రజల్లో విశ్వాసం నింపిందని అమిత్‌షా అన్నారు.

”కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాలు ఈ మూడింటిలోనూ హింస గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల సంఖ్య తగ్గడమే కాదు.. లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మోదీ సర్కార్‌ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న కఠిన వైఖరి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని ప్రజలకు స్పష్టం చేస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే కఠినంగా అణచి వేస్తాం. ఇందులో సీఐఎస్‌ఎఫ్‌, రాష్ట్ర పోలీసులది కీలకపాత్ర. ఇదే గత 9 ఏళ్లుగా చేసి చూపించాం.” అని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వెల్లడించారు.

- Advertisement -

హైదరాబాద్‌ హకీంపేట్‌లోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం
54వ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘రైజింగ్ డే’ వేడుకలను తొలిసారి దిల్లీ వెలుపల హకీంపేట్‌లోని సీఐఎస్​ఎఫ్​ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, డీజీపీ అంజనీకుమార్‌ పాల్గొన్నారు. ముందుగా గౌరవవందనం స్వీకరించిన అమిత్‌షా.. దేశవ్యాప్తంగా సీఐఎస్​ఎఫ్​ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు రివార్డులు అందజేశారు. అనంతరం ‘రైజింగ్‌ డే’ వేడుకల సందర్భంగా సీఐఎస్​ఎఫ్​ సత్తాను కళ్లకు కట్టేలా నిర్వహించిన కవాతులు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement