Saturday, April 27, 2024

Spl Story: ప్రతిపక్ష అగ్రనేతల ఓటమే లక్ష్యం, అమేథీ ఫలితం పునరావృతం.. కమలనాథుల నయా వ్యూహం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమెథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీని ఓడించిన విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల్లో అగ్రనేతలను ఓడించేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా కూటమిగా ఏర్పడాలన్న ప్రయత్నాలు ఓవైపు, కాంగ్రెస్-బీజేపీయేతర మూడవ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో, ప్రతిపక్ష పార్టీల నేతలను తమ తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం చేసే వ్యూహాలకు కమలనాథులు పదును పెడుతున్నారు.

యుద్ధంలో రాజును పడగొడితే సరిపోతుందన్న చందంగా, ఎన్నికల రణక్షేత్రంలో ఆయా పార్టీల అధినేతలను ఓడించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాంతో ఆయా నేతలు తమ సొంత నియోజకవర్గం దాటి బయట తిరగలేని పరిస్థితి తీసుకురావాలని భావిస్తోంది. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలంటే మరింత పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లక తప్పదని కమలదళ అగ్రనేతలు భావిస్తున్నారు.

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అగ్రనాయకత్వం, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన 144 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందులో కనీసం సగం, అంటే 77 సీట్లు గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో అధిష్టానం ఉంది. వీటిలో ఎక్కువ భాగం ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధినేతలు పోటీ చేసిన నియోజకవర్గాలేనని పార్టీ గుర్తించింది. అందుకే వారి సొంత ఇలాఖాలో దెబ్బకొట్టి మానసికంగా కృంగదీయాలని భావిస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 282 సీట్లు సాధించిన బీజేపీ, 2019లో ఏకంగా 303 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్షాలను మరింత ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే రెండోసారి గెలుపొందే క్రమంలో 2014లో కొద్ది తేడాతో ఓడిపోయిన స్థానాల్లో 30 శాతం సీట్లను గెలుపొందింది. ఈసారి కనీసం 50 శాతం సీట్లలో గెలుపొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రత్యేక దృష్టిసారించిన 144 నియోజకవర్గాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, మయిన్‌పురి నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని బారామతి వంటి నియోజకవర్గం ఉన్నాయి.

- Advertisement -

రాయ్‌బరేలి..
2004 నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం రాయ్‌బరేలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలుస్తూ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 20 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 17 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 1977లో ఇందిరా గాంధీ ఒకసారి ఓటమిపాలవగా, 1996, 98లో బీజేపీ నేత అశోక్ సింగ్ రెండు పర్యాయాలు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీ పక్కనే ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన కమనదళం, అదే సమయంలో రాయ్‌బరేలీలో సోనియా గాంధీ మెజారీటీని 3.52 లక్షల నుంచి 1.69 లక్షలకు తగ్గించగల్గింది.

2022లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో 1 స్థానాన్ని కైవసం చేసుకోగల్గింది. దీంతో మరింత దృష్టిపెడితే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపు సాధ్యమేనని భావిస్తోంది. ఒకవేళ అనారోగ్య కారణాల రీత్యా 2024లో సోనియా గాంధీ ఎన్నికల్లో పోటీచేయకపోయినా, ఆ స్థానం నుంచి ఆ కుటుంబంలోని నేతలు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే ఈ స్థానంపై బీజేపీ గురిపెట్టింది.

మయిన్‌పురి..
గాంధీ-నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి రాయ్‌బరేలీ ఎలాగైతే కంచుకోటగా నిలిచిందో, అదే తరహాలో యూపీలోని మయిన్‌పురి నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్‌కు కంచుకోటగా మారింది. 1996 నుంచి వరుసగా 7 పర్యాయాలు ఆయన గెలుపొందారు. 2024 ఎన్నికల్లో ఆయన కూడా అనారోగ్యం, వయోభారం కారణాలతో పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే యాదవ్ పరివార్ నుంచే ముఖ్య నేతను ఇక్కడ బరిలోకి దించే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో 94 వేల ఓట్ల తేడాతో బీజేపీ ఇక్కడ ఓటమిపాలైంది. ఈసారి ఎలాగైనా గెలుపొంది సమాజ్‌వాదీ కంచుకోటను దెబ్బతీయాలని చూస్తోంది.

బారామతి..
మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కుటుంబానికి కంచుకోట. 1989 నుంచి ఈ నియోజకవర్గంలో శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు గెలుపొందుతూ వచ్చారు. 2009 నుంచి ఈ స్థానంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే వరుసగా 3 పర్యాయాలు గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి బీజేపీపై 1.56 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండోస్థానానికి పరిమితమైన బీజేపీ, ఈసారి అక్కడ ఎలాగైనా గెలుపొందాలని చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement