Friday, April 26, 2024

రాహుల్‌పై కేసు గాంధీ-నెహ్రూ కుటుంబంపై కుట్ర

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును గాంధీ-నెహ్రూ కుటుంబంపై జరుగుతున్న కుట్రగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అభివర్ణించారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, పరువు నష్టం కేసుపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, న్యాయపోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తే అక్కడ ముఖ్యమంత్రి సన్నిహితులపై ఈడీ దాడులు చేసిందని గుర్తుచేశారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ దేశం విడిచి పారిపోయారని, అలాంటివారి గురించి మాట్లాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు.

బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ వెనక్కు తగ్గదని గిడుగు ప్రకటించారు. రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేపడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందని అన్నారు. విశాఖపట్నం రాజధాని అన్న తర్వాత కూడా ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ ఓడిపోయిందని అన్నారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి పదవులు పొంది పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు వీడి వెళ్ళారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై సరైన సమయంలో స్పందిస్తానని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామాను నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement