Wednesday, July 24, 2024

TG | త్వరలో ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు : మంత్రి శ్రీధర్ బాబు

అతి త్వరలో తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డును తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. అమెరికా పర్యటనలో భాగంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

ప్రవాస భారతీయులు పుట్టిన ఊరుకు మేలు చేసే విధంగా గ్రామ పురోగతిలో భాగస్వాములు కావాలన్నారు. కేరళలో ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు విజయవంతంగా నడుస్తుందని అంతకన్నా మిన్నగా తెలంగాణ ప్రవాస భారతీయ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.

త్వరలో పెద్దపల్లి జిల్లాలో 1000 కోట్లతో కోకకోల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన నిజాం సుగర్ ఫ్యాక్టరీని ఏడాదిలోగా తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

చెరుపు రైతులకు మేలు చేయడంతో పాటు ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని, ప్రవాస భారతీయులు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు రావాలన్నారు.

హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. మూసి రివర్ ఫ్రెంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాదును ఏఐ క్యాపిటల్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. ప్రవాస భారతీయులు పుట్టిన గడ్డకు మేలు చేసే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement