Tuesday, May 14, 2024

దేశానికి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంగా తెలంగాణ.. 9 రాష్ట్రాలకు విత్తనాలు ఎగుమతి ఇక్క‌డి నుంచే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం దేశ రైతాంగానికి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంగా నిలుస్తోంది.అధిక దిగుబడులు ఇచ్చే వైవిధ్య పంటల సాగును ప్రోత్సహిస్తూ… రాష్ట్రంలో స్థిరమైన వ్యవసాయాభివృద్ధి కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకు దోహదపడే పంటలను రైతులు సాగు చేసేలా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కృషితో వైవిధ్యమైన లాభదాయక పంటల సాగువైపు తెలంగాణ రైతులు మళ్లుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల భూములకు అనువైన పంట రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు అందుబాటులో ఉంచుతోంది.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే 18 పంటలకు చెందిన 60 రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, చీడ పీడలను తట్టుకునే రకాలపై క్షేత్రస్థాయి ప్రదర్శనల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. 2021-22లో 33.619 ఎకరాల విస్తీర్ణంలో 1, 60,441 క్వింటాళ్ల విత్తనాలను సంస్థ ఉత్పత్తి చేసింది. విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తున్న పంటల రకాల్లో ప్రధాన పంటలు అయిన వరి, మిర్చి, పత్తితోపాటు వేరుశనగ, కంది, మొక్కజొన్న, రాగి, కొర్రతలు తదితర పంట విత్తనాలు ఉన్నాయి.

రాష్ట్ర రైతులతోపాటు దేశ వ్యవసాయ రంగంలో ప్రధాన రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్‌, చత్తీస్‌గడ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు వివిధ రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎగుమతి చేస్తోంది. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో వ్యవసాయరంగం ముఖ్య భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. రైతులు, వ్యవసాయ సమస్యలపై అవగాహన ఉన్న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. 2021-22 అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 18.3 శాతాన్ని వ్యవసాయర ంగం జమచేసింది. వ్యవసాయరంగర్పై 48.4శాతం జనాభా ఆధారపడి జీవిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక, సేవా రంగాలకు వ్యవసాయరంగం ఊతంగా నిలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement