Saturday, April 20, 2024

కొవ్వాడ అణు విద్యుత్‌పై వెస్టింగ్‌హౌస్‌తో చర్చలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కొవ్వాడలో ఆరు అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కోసం  వెస్టింగ్‌హౌస్‌ కంపెనీ (అమెరికా)తో చర్చలు జరుపుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. వెస్టింగ్‌హౌస్‌ కంపెనీతో చర్చలు ముగిసిన అనంతరం అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు అయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు ఖరారు అవుతాయని మంత్రి వివరించారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ముందు జరిగే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భూసేకరణ, ప్రాజెక్ట్‌  ఏర్పాటుకు అవసరమైన అనుమతులు పొందడం, ప్రాజెక్ట్‌ స్థలంలో భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం వంటి పనులు జరుగుతున్నాయి. కొవ్వాడ  అణు విద్యుత్‌ ప్రాజెక్ట్‌ కోసం 2079 ఎకరాల భూమి అవసరం ఉంది. ఇప్పటికి 2061 ఎకరాల భూసేకరణ పూర్తయింది. ఈ భూమిని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ పేరిట బదలాయించడం కూడా పూర్తయిందని మంత్రి తన జవాబులో పేర్కొన్నారు.

అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణం ఊపుగా జరిగే సమయంలో సుమారు 8 వేల మందికి కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ఉపాధి లభిస్తుంది. ఈ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించిన అనంతరం ప్రతి యూనిట్‌లో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్లాంట్‌లలో వచ్చే ఉపాధి అవకాశాలతోపాటు విద్యుత్‌ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం కంట్రాక్టర్లు, వెండర్ల  వ్యాపారం వలన జరిగే ఆర్థిక కార్యకలాపాలతో  ఇంకా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి జితేంద్ర సింగ్‌ వివరించారు.

ఏపీలో 564 మంది విద్యార్ధులకు కేవీపీవై ఫెలోషిప్‌లు

- Advertisement -

కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్‌ యోజన (కేవీపీవై) పథకం కింద గడచిన 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో 564 మంది విద్యార్ధులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. కేవీపీవైకి ప్రత్యేకించి నిధులు కేటాయింపు ఏదీ ఉండదని, ఇన్‌స్పైర్‌, ఇన్స్పైర్-షీ బడ్జెట్ కింద కేటాయించిన నిధులతోనే కేవీపీవై ప్రోగ్రాం అమలు చేస్తారని తెలిపారు. కేవీపీవై ఫెలోషిప్ కింద 2023-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 1 వరకు 843.80 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్‌ యోజన కింద 2019-20లో 17.34కోట్లు, 2020-21లో 20,71 కోట్లు, 2021-22 లో 13.45 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా  పరిశోధన రంగంలో ప్రతిభ, యోగ్యత కలిగిన విద్యార్దులను అధిక సంఖ్యలో గుర్తించేందుకు కేవీపీవై ప్రోగ్రాంను (ఎస్‌హెచ్‌ఈ) స్కాలర్‌షిప్‌ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానించినట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా ఔత్సాహికులు  ప్రాథమిక, నేచురల్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు ప్రతి ఏటా 12 వేల రూపాయల చొప్పున ఉపకారవేతనం లభిస్తుందని అన్నారు. ఇన్‌స్పైర్‌, ఇన్స్పైర్-షీ (స్కాలర్‌షిప్‌ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్) యోగ్యతను బట్టి పోటీ పరీక్షల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు.

6వ తరగతి నుండి 10వ తరగతిలోపు విద్యార్దులను ఆకర్షించేందుకు శాస్త్ర, సాంకేతిక విభాగం ఇన్‌స్పైర్‌ పేరిట ఒక జాతీయస్థాయి కార్యక్రమం నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఇన్స్పైర్-మానక్ కింద ప్రతి ఏటా 10 లక్షల ఐడియాలు దేశవ్యాప్తంగా మాధ్యమిక, ఉన్నత పాఠశాల నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అందులో లక్ష ఐడియాలను ఎంపిక చేసి వాటిని ప్రతిపాదంచిన ఒక్కొక్క విద్యార్ధి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా 10 వేల రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా, రాష్ట్రస్థాయి ప్రదర్శనల తరువాత జాతీయస్థాయిలో 60 ఐడియాలను ఎంపిక చేసి వారికి ఇన్‌క్యుబేషన్‌ సపోర్టు అందిస్తారు.  అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ద్వారా ప్రతి ఏటా 10 నుండి 17 సంవత్సరాల విద్యార్ధుల కోసం సైన్స్ కాంగ్రెస్‌లు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement