Sunday, April 28, 2024

Supreme Court – యావత్ భారతం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న వ్యాజ్యం పై తీర్పు నేడే

జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ ఇప్పటికే పూర్తయింది..

ఇవాళ ఈ కీలక అంశంపై తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్ము కశ్మీర్ భారతదేశంలో విలీనం సమయంలో అప్పటి సంస్థానాధిపతులతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేర్చారు. నాలుగున్నరేళ్ల క్రితం అంటే 2019 ఆగస్టు 6న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఈ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది.

ఇవాళ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇవాళ తీర్పు వెలువడనున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా జమ్ము కశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కొందరిని అదుపులో తీసుకోగా, మరి కొందరిని గృహ నిర్బంధం చేశారు. 2 వారాల ముందు నుంచే కశ్మీర్ లోయలో పెద్దఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాలు పూర్తిగా పోలీసుల నియంత్రణలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement