Wednesday, May 1, 2024

వర్షాకాలం ప్రణాళిక సిద్ధం.. వరద ప్రాంతాల గుర్తించి ప్ర‌త్యేక చ‌ర్య‌లు: ఎస్‌పీడీసీఎల్‌

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్న అధికంగా 104 శాతం వర్షాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటనతో విద్యుత్‌శాఖ సన్నద్దం అవుతుంది. గతంలో ఉన్న అనుభవాలతో వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గత సంవత్సరం ఈ పద్దతిని అవలంభించడం ద్వార 48 గంటల పాటు నిరంతర వర్షాలు కురిసి విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందులు వచ్చి నప్పటికి కేవలం దాదాపు 98శాతం ప్రాంతాలలో 24 గంటలలో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు వరదలు వచ్చినా విద్యుత్‌సరఫరాలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రతిష్ట చర్యలకు సిద్దమవుతున్నారు.

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్‌పీడీసీఎల్‌ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. వర్షా కాలంలో ఏలాంటి విద్యుత్‌ అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్లే కాకుండా గత అనుభవాలను దృష్ట్యా వరదలు రావడానికి అస్కారం ఉన్న ప్రాంతాలలో అదనంగా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ ఏలాంటి సమస్య వచ్చినా క్షణాల్లో విద్యుత్‌ పునరుద్దరించడానికి అవసరమైన రెస్క్యూ టీమ్‌లను సిద్దం చేస్తున్నారు. ప్రధానంగా వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో నిర్మించిన అపార్ట్‌మెంట్లలో సెల్లార్‌లలో ఉన్న మీటర్లను మొదటి అంతస్తులో ఏర్పాటు చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు గాలి, దూమారంతో చెట్లు విరిగి పడ్డా, విద్యుత్‌ వైర్లు తెగిపడ్డా వెంటనే సమీపంలోని ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌కు గానీ, లేదా కంట్రోల్‌ రూ మ్‌కు గానీ, లేదా ఏఈ, ఏడీఈ, డీఈ లకు సమాచారం అందించాలని వినియాగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. తడి సమయంలో విద్యుత్‌ స్థంభాలను , స్టే వైర్లను తాక కూడదని, తడి చేతులతో ఇళ్ళల్లో కూడా స్విచ్‌ వేయడం, విద్యుత్‌ సంబంధిత పనులు చేయకూడదని వినియోగదారులకు అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్‌ స్థంభాలు కూలి పడ్డా, విద్యుత్‌ వైర్లు తెగి పడ్డా అటు వైపు ఎవరిని వెళ్ళనీయకూడదని సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement